ఎన్నికల్లో పనిచేసుకోకుండా జగన్ కుట్రలుఈసీకి చంద్రబాబు, పవన్ ఫిర్యాదు
ఇన్నాళ్లుగా చెబుతున్నదానిపై ఇవాళ టీడీపీ, జనసేన ఫుల్ క్లారిటీ ఇచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఈసీ గట్టిగా లేకుంటే, ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని… ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా జగన్ సర్కారు కుట్రలు చేస్తోందని ఈసీకి వివరించామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ సర్కారు తీరుపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు చంద్రబాబు. ప్రతిపక్షాలపై జగన్ సర్కారు ఇష్టానుసారం కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. సచివాలయ సిబ్బందితో ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

ఐతే తమ అభ్యంతరాలను ఈసీ పెద్దలు సావధానంగా విన్నారని… ఎన్నికల సంఘం కట్టిదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి అవకతవకలు జరక్కుండా ఈసీ చూస్తోందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికలను అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఒక్క ఓటు దొంగ ఓటున్నా ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జగన్ సర్కారు చేస్తున్న తప్పుడు పనులను ప్రతిఘటిస్తామన్నారు. ఎవరినీ వదిలిపెట్టమన్నారు. అక్రమాలకు పాల్పడ్డవారిపై కోర్టుకు వెళ్లి శిక్ష పడేవరకు పోరాడతామన్నారు. తమ విన్నపాలను ఈసీ ఓపిగ్గా వినడమే కాకుండా, భరోసా ఇచ్చిందన్నారు. ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని ప్రభుత్వం ఎలా చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.