ఆందోళన విరమించిన రిమ్స్ జూనియర్ డాక్టర్లు
గత రెండు రోజులుగా ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ డాక్టర్లు ఇటీవల తమపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఎట్టకేలకు వారు ఆందోళనలు విరమించారు. కాగా రిమ్స్ అధికారులతో జరిగిన చర్చలు సఫలం కావడం వల్లనే ఆందోళనలు విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విధులకు హాజరవుతామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమపై జరిగిన దాడి ఘటనపై రిపోర్ట్ వచ్చాక తదుపరి కార్యచరణ చేపడతామన్నారు.రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అర్థరాత్రి కలకలం రేగింది. కాగా గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి కారుతో క్యాంపస్‌లోకి చొరబడినట్లు తెలుస్తోంది.దీంతో అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నిందితులు జూనియర్ డాక్టర్లను పట్టించుకోకుండా క్యాంపస్‌లోకి దూసుకొచ్చారు. అంతేకాకుండా వారు తమపై దాడి చేసినట్లు జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. కాగా దాడి చేసిన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ కూడా ఉన్నారని వారు తెలిపారు.దీంతో జూనియర్ డాక్టర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారంతా విధులు బహిష్కరించి కలక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.