అసెంబ్లీలో ఆకట్టుకున్నగవర్నర్ తమిళిసై ప్రసంగం
తెలంగాణ కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి, ఉభయసభ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ముందుగా కాళోజీ కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కొత్త ప్రభుత్వానికి స్పీకర్‌కు, కొత్త అసెంబ్లీ ఎమ్మెల్యేలకు, కేబినెట్ మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో కొత్త ప్రభుత్వం మంచిపేరు సాధిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంతో ప్రభుత్వం మొదలయ్యిందని, ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు తగిన విధంగా పరిపాలించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల సంక్షేమం కోసం ప్రకటించింది. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు పరిచింది. రైతులు, యువత, మహిళలకు మన ప్రభుత్వం రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేసి రైతుల భూములకు భద్రత కల్పిస్తాం. దేశంలోనే ప్రజారంజక పాలనలో రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ప్రజలు స్వేచ్ఛాపూరిత పాలనను కోరుకున్నారు. మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. తెలంగాణ నిర్భందపు పాలన నుండి విముక్తిని పొందింది. యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన అప్పటి స్కీములను ప్రజలకు అందుబాటులో తెస్తామని మాట ఇస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో ప్రాజెక్టులలో ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం. పాలకులకు, ప్రజలకు మధ్య ఇనుపకంచెలు తొలగాయి. గత ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో కూడిన ప్రభుత్వాన్ని అప్పగించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం. పాలకులు ప్రజాసేవకులే కానీ నాయకులు కారు. నిర్భంద పాలన నుండి ప్రజలకు విముక్తి కలిగింది. శాసన సభ అలంకారం కోసం ప్రజాపాలన కోసం అని నిరూపిస్తాం. పాలకులు పెత్తం దారులు కాదని తెలియజేస్తాం. తెలంగాణా గ్రామీణ పరిశ్రమలు వృద్ధి చేస్తాం. అమరుల ఆశయాలను నెరవేరుస్తాం అంటూ ప్రభుత్వ పథకాలను, వాగ్దానాలను తెలియజేశారు గవర్నర్.