ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తెలంగాణా మాజీ సీఎం
తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి నందినగర్‌లోని తన పాత నివాసానికే వెళ్లనున్నట్లు తెలుస్తోంది.కాగా మాజీ సీఎంకేసీఆర్ తాను తెలంగాణా సీఎం అయ్యే వరకు నందినగర్ నివాసంలోనే ఉన్నారు. అయితే ఇటీవల కేసీఆర్ తన నివాసంలో ప్రమాదవశాత్తు కాలుజారి పడ్డారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కేసీఆర్‌ను పరీక్షించిన వైద్యులు ఆయనకు తుంటి ఎముక విరిగిందని.. శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. ఈ మేరకు వారు డిసెంబర్ 8వ తేదిన కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. దీంతో కేసీఆర్ గత 8 రోజులుగా యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నామని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

