గాజాపై కాల్పుల విరమణ ఒప్పందాన్ని వీటో అధికారంతో అడ్డుకున్న అమెరికా
ఇజ్రాయెల్ -హమాస్‌ల మధ్య పోరులో గాజాలోని ప్రజలు బలవుతున్నారు. ఈ నరమేధాన్ని, గాజాపై కాల్పులను అరికట్టడానికి ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఒప్పందాన్ని అమెరికా తన వీటో అధికారంతో అమలు కాకుండా అడ్డుకుంది. దీనిని భద్రతా మండలిలో యునైటెడ్ అరబ్ అమిరేట్స్ ప్రతిపాదించింది. ఈ ముసాయిదాకు 13 దేశాలు అనుకూలంగా ఓట్లు వేశారు. బ్రిటన్ ఓటింగ్‌కు దూరమయ్యింది. హమాస్ చర్యల పట్ల ఎలాంటి ఖండన లేకపోవడంతో తాము ఈ ఓటింగుకు దూరంగా ఉన్నామని బ్రిటన్ తెలిపింది.

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు పరచాలని, గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారంతో యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99ను ప్రయోగించారు. దీనితో భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ నిర్వహించారు. మండలిలోని సభ్యదేశాలలో ఇజ్రాయెల్, అమెరికా గాజాపై కాల్పుల విరమణకు వ్యతిరేకంగా ఉన్నాయి. దీనివల్ల హమాస్ బలం పుంజుకుంటుందని, ఇజ్రాయెల్ మరింత సంక్షోభానికి గురవుతుందని వాదించాయి. గాజాలోని పౌరుల రక్షణ కోసం, బందీల విడుదల కోసం మాత్రం యుద్ధంలో విరామాలు ప్రకటిస్తామని ఒప్పందానికి వచ్చాయి. ప్రస్తుత ముసాయిదాలో సవరణలు చేయాలని సభ్యదేశాలకు అమెరికా సూచించింది. ఇప్పటి వరకూ ఈ యుద్ధంలో 1200 మంది చనిపోగా, 240 మంది బందీలుగా మారారు. ఈ అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్ హఠాత్తుగా దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఖండించాలంటూ ఇజ్రాయెల్ సభ్య దేశాలను డిమాండ్ చేసింది.