దేశంలో రైల్వే, విమానయాన సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నమోడీ
నిజామాబాద్: దేశంలో రైల్వే, విమాన, నౌకాయానంతో పాటు పలు సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి ప్రధాని మోడీ దేశ సంపద కొల్లగొడుతున్నారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ట్యాక్స్ వంటి చర్యలు అమలుచేయడం ద్వారా మోడీ స్నేహితులకు లాభం జరిగింది తప్ప.. ప్రజలకు కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలు దళితులకు మూడెకరాలు, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలు కాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్లు జేబులో వేసుకుందని ఆరోపించారు. సినీనటి విజయశాంతి మాట్లాడుతూ.. గ్రామాల్లో పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రస్కు ఓటేయాలని పేర్కొన్నారు.

