సిద్దిపేట: గజ్వేల్ లోని 9 గ్రామాలలో ఈటల రాజేందర్ ప్రచారం
సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గం ఆర్ అండ్ ఆర్ కాలనీలోని 9 గ్రామాలలో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం.
పోలీస్ రాజ్యం ఇంకెన్నాళ్లు నడుస్తుంది. పోలీసోళ్లతో భయపెట్టి ఎన్నాళ్లు నడిపిస్తావు. కొన్నిరోజులు ఆగండి… బీజేపీ వస్తే ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఏ ప్యాకేజీలు ఉన్నాయో అవన్నీ ఇస్తాం.. మీ ఇళ్లలో నాలుగు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తాం.. కల్యాణ్ లక్ష్మి, పింఛన్లు ఏవీ ఆగవు. ఇద్దరు ముసలోళ్లకు ఇస్తాం.. మీ కుటుంబంలో వైద్యం ఖర్చు మీద పడితే పది లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం.
కుర్చీ కావాలని ముఖ్యమంత్రి కావాలని కాదు.. మీ ఆశీర్వాదం ఉంటే అవుతా.. పిల్లలకు మంచి వైద్యం అందిస్తాం. మంచి విద్య అందిస్తాం… పండించే వరి ధాన్యాన్ని కిలో తరుగు లేకుండా గింజ వదిలిపెట్టకుండా కొనే జిమ్మేదార్ తీసుకుంటాం.. క్వింటాకు 3100 రూపాయల మద్దతు ధర ఇస్తాం.. గట్టిగా ఉండి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలంటే ఓటు హక్కు వినియోగించుకోండి.. కేసీఆర్‌ను గద్దె దించాలి, లేదంటే మనకు ఈ బాధలు పోవు. ఏటిగడ్డ కిష్టాపురం దేశానికి తెలుసు. ప్రభుత్వం నిండా ముంచింది.
బీజేపీ నాయకులను రానీయకండి.. ఈటల వద్దకు పోవద్దని చెబుతున్నారు.. 9 గ్రామాల ప్రజలు రోషమున్నవారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయరు. మూడంతస్తులు, నాలుగంతస్తుల భవనాలన్నీ గజ్వేల్ ప్రజలను ముంచినోళ్లవి.. ప్రజల నోరు కొట్టి, కడుపు కొట్టినోళ్లవి.. హుజూరాబాద్‌లో 600 కోట్ల ఖర్చు పెట్టి.. 2 వేల కోట్లు దళితబంధు ఇచ్చి, గొర్ల కొరములకు గొర్రెలిచ్చి, కొమరివెళ్లి మల్లన్న కంకణాలు, పసుపు బియ్యం పట్టుకొచ్చి ప్రమాణం చేయించినా హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లుమనిపించారు. నువ్వు కొట్లాడి కేసీఆర్‌పై గెలిచి గజ్వేల్ రమ్మని ప్రజలు అడిగారు.
గజ్వేల్ నుంచి పోటీ చేయమని మనవాళ్లు అడిగారు.. నేనోంటో మీకు తెలుసు. ప్రాజెక్టు కడితే నీళ్లొస్తాయంటున్నారు. కానీ మమ్మల్ని మల్లన్న సాగర్‌లో ముంచి వాళ్లకు నీళ్లిస్తానంటే మంచిదా.. ప్రాజెక్టు కట్టు కానీ.. మా గ్రామాలను ముంచుతున్నప్పుడు మా భూములను దూరం చేస్తున్నప్పుడు మేం బతకొద్దా.. ఏమిచ్చారు.. మన ఊరు పట్టు.. ఉడుంపట్టు.. మాదీగడ్డ అని చెప్పుకునేవారు… మన ఊరిపై ఉన్న మమకారాన్ని తెంపేశారు. భూమి ధర రూ.5 లక్షల, రూ.6 లక్షలకు భూమి దొరుకుద్దా.. 5 ఎకరాలు అమ్ముకున్నా ఎకరా భూమి కొనలేకపోతున్నాం… ముంపు 9 గ్రామాలు రోడ్లు బాగానే ఉన్నాయా? చచ్చిపోతే బొంద పెట్టడానికి జాగాల్లేవ్.. ముంపు గ్రామాల ప్రజల సమస్యలహారం చేశారు. వాటన్నింటినీ పరిష్కరిస్తాం.. స్మశానవాటికల సమస్యను తీర్చుతానంటూ ఈటల భరోసా. 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులకు , వృద్ధుల పరిహారం ప్యాకేజీ ఏదీ కూడా రాలేదు. ఇళ్లకు డబ్బిచ్చారు. కోల్పోయిన జాగాకు డబ్బులు రాలేదు. మీ బిడ్డ సొమ్ము, మీ కొడుకు సొమ్ము అడగడం లేదు…
9 గ్రామాల త్యాగాల పునాదితో వందల గ్రామాలకు సుఖం వస్తుందన్నాడు. కానీ 9 గ్రామాల ప్రజల బాగు ఆలోచించాలి కదా.. ఎప్పుడూ కేసీఆర్ ఆలోచించలేదు.. 6 లక్షలకు ఎకరా భూమి వస్తదా.. 5 ఎకరాలు అమ్ముకుంటే ఒక ఎకరా కూడా రాని పరిస్థితి.. రైతుల భూములకు పట్టాలిప్పిస్తా.. బకాయిలు రాలేదు. అన్నీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇస్తాం…
రేపు బీజేపీ అధికారంలోకి వస్తే మీ ఇళ్లల్లో ఇద్దరు ముసలోళ్లు ఉంటే ఇద్దరికీ పింఛన్లు ఇస్తుంది. పింఛన్లు రావంటున్నారు. ఎవరొచ్చినా పింఛన్లు ఆగవ్. ప్రభుత్వం వచ్చినా రెండు పింఛన్లు ఇచ్చే జిమ్మేదార్ మాది. పేదల ఇళ్లల్లో బతికేవారు ఉజ్వల గ్యాస్ ఉన్నవారికి ఏడాదికి నాలుగు సిలిండర్లు ఇస్తాం.. మీ ఊళ్లలో వైద్యం ఖర్చులు భరించే పరిస్థితి లేకుండా క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ ఎటాక్, యాక్సిడెంట్లలో బాధితులకు ఇకపై ఆ బాధ లేకుండా బీజేపీ అధికారంలోకి వస్తే 10 లక్షల వైద్య ఖర్చులన్నీ మేమే భరిస్తాం. మన ఇళ్లలో పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. కూలి పని చేసుకుంటూ కూడా, కంకులు అమ్మేవారు కూడా పిల్లలకు మంచి విద్యను అందించాలని వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. తొమ్మిదిన్నర, పదేళ్లలో ఉద్యోగాలు రాలేదు. పిల్లలకు నౌకరీలు రావాలంటే బీజేపీ రావాలి. ఆరు నెలల లోగా కానీ, ఏడాది లోగా కానీ ఖాళీలన్నింటినీ భర్తీ మా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది.
కేసీఆర్ ఏనాడైనా వచ్చాడా.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు కాదా.. ముంపు ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారో వచ్చి చూశాడా.. ఉంటే ప్రగతి భవన్, లేకుంటే ఫామ్ హౌస్.. ఆయన పదవులు, ఆయన వ్యవసాయం కానీ ప్రజల గురించి ఆలోచించడు.. నాకు ఓటేయండి కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా… భూములున్నవారికి వడ్ల ధర రూ.2,200 ఉంది. మూడో తారీఖు తర్వాత రూ.3,100 క్వింటాలు కొంటాం. కిలో కూడా తరుగు తీయం. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.6,300 కోట్లతో తిరిగి తెరిచాం. మెట్పల్లి నిజాం ఏరియాలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడ్తే.. ఆ కంపెనీ ఓపెన్ చేస్తా అని కేసీఆర్ చెప్పి పదేళ్లయ్యింది. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే దాన్ని కూడా ఓపెన్ చేస్తాం… ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం… భద్రత ఉండే కేంద్ర సంస్థలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాం.. నేను రాబట్టే దావత్‌లు, డబ్బులిస్తున్నాడు.. కేసీఆర్‌కు మనకు అవసరం ఉన్నప్పుడివ్వడు.. ఆయనకు అవసరమొచ్చినప్పుడే ఇస్తాడు..
కేంద్రం బియ్యమిస్తే మీరెందుకు బియ్యం ఇవ్వకుండా ఆపారని ఈటల, కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఒకే ఇంట్లో నాలుగు పదవులున్నాయ్.. మన ఇంట్లో ఒక నౌకరీ లేదు. కొడుకు ముఖ్యమంత్రి కావాలి, లేదా అల్లుడు కావాలి, బిడ్డ కావాలి. లేదంటే సడ్డకుడు కొడుకు కావాలి. మనకు మాత్రం ఏమీ లేవు. పేరుకే బంగారు తెలంగాణ.. కదిలిస్తే కన్నీరుమయం.. ఈసారి కేసీఆర్‌కు ఓటేస్తే గోసపడ్తారు..
దేశంలోనే తాపించడంలో కేసీఆర్ నెంబర్ వన్, రూ.10,700 కోట్లు ఉండే ఆదాయం ఇప్పుడు రూ.45 వేల కోట్లు… పింఛన్లు, కల్యాణ లక్ష్మి డబ్బులన్నీ కూడా దీనికంటే తక్కువే… ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు. కేసీఆర్ కారుకి కూడా పెట్రోల్ మీరే ఇస్తున్నారు.. మన డబ్బుతో ఆయన బతుకుతున్నాడు.. ప్రజలను తాగుడుకు బానిసలను చేస్తున్నాడు. కేసీఆర్ మిగిల్చిన దుఃఖాన్ని భరిస్తున్నది నా తెలంగాణ ఆడబిడ్డలే… దేశంలోనే లిక్కర్ ఎక్కువగా తాగే రాష్ట్రం తెలంగాణ… ముంపు గ్రామాల ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. జై తెలంగాణ..