Home Page SliderTelangana

ఆందోల్‌లో రాజనర్సింహకు తిరుగులేదా?

ఆందోల్ నియోజకవర్గం సంచలనాలకు మారు పేరుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ్నుంచి గెలిచిన నేతలు ఆయా ప్రభుత్వాల్లో మంత్రులుగానూ పనిచేయడంతో నియోజకర్గం రూపురేఖలు మారిపోయాయి. సినీ నటుడు బాబూ మోహన్, ఇక్కడ్నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి మంత్రిగానూ పనిచేశారు. గతంలో ఇక్కడ్నుంచి మూడుసార్లు గెలిచిన ఆయన, రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సైతం గెలుపొందారు. ఐతే ఆ తర్వాత పార్టీ టికెట్ నిరాకరించడంతో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరోసారి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీలో నిలిచారు. ఆందోల్ నుంచి గెలిచిన దామోదర రాజనర్సింహా ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేసి పేరు సంపాదించుకున్నారు. ఇక్కడ్నుంచి గత ఎన్నికల్లో దామోదర రాజనర్సింహపై సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి కిరణ్ విజయం సాధించారు. మరోసారి విజయం సాధించాలని క్రాంతి కిరణ్ భావిస్తున్నప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆందోల్‌లో ఎవరికి అందలమో.. ఎవరికి ఆందోళన అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

ఇక ఆందోల్ ఎస్సీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 313. పురుష ఓటర్లు 1,20,572. మహిళా ఓటర్లు 1,24,133. ఐదుగురు ట్రాన్స్ జెండర్లు ఓటు నమోదు చేసుకున్నారు. మొత్తం ఓటర్లు 2,44,710 ఉన్నారు. ఆందోల్ ఎస్సీ నియోజకవర్గంలోనూ ముదిరాజ్ జనాభా అత్యధికంగా ఉంది. సుమారు ఈ వర్గం ఓటర్లు 20 శాతానికి చేరువగా ఉన్నారు. ఇక మాదిగలు 12 శాతానికి పైగా ఉండగా, మాలలు పదిన్నర శాతం మేర ఉన్నారు. ఇక ముస్లింలు సైతం 9 శాతానికి చేరువగా ఉన్నారు. గొల్లలు 8 శాతం, రెడ్లు ఆరున్నర శాతం, లింగాయత్‌లు 6 శాతానికి పైగా ఉన్నారు. పద్మశాలీలు ఐదున్నర శాతం, గౌడలు సుమారుగా 4 శాతానికి చేరువగా ఉన్నారు. లంబాడాలు మూడున్నర శాతం వరకు ఉండగా, ఇతర అన్ని కులాలు 17 శాతానికి పైగా ఉన్నారు.