Home Page SliderTelangana

ఆర్మూర్‌లో నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ

ఆర్మూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈసారి హోరాహోరీ నెలకొంది. వరుసగా మూడోసారి గెలిచి హాట్రిక్ విజయాలు సాధించాలని కసిగా ఉన్న ఆశన్నగారి జీవన్ రెడ్డి అందుకు తగిన విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంటే.. ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డిని ఓడించితీరుతామంటున్నారు ప్రత్యర్థులు. దీంతో ఈ ఎన్నికల్లో ఆర్మూరు నుంచి జీవన్ రెడ్డి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ నుంచి వినయ్ రెడ్డి, బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ప్రభావం చూపించే ఈ నియోజకవర్గంలో పోటీ ఈసారి గులాబీ పార్టీకి కొంత టఫ్ అన్న భావన వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని జాక్ పాట్‌గా కొట్టాలని జీవన్ రెడ్డి భావిస్తుంటే… ఇక్కడ్నుంచి జీవన్ రెడ్డి గెలుపు అంత వీజీ కాందంటున్నారు ఎక్స్‌పర్ట్స్. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డి విజయం సాధించేందుకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంటే, బీజేపీ అభ్యర్థి సైతం రేసులో నేనున్నానంటున్నారు. మొన్నటి వరకు బీజేపీలో కొనసాగిన వినయ్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఛాన్స్ దక్కించుకున్నారు.

ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 217 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 96,404, స్త్రీ ఓటర్లు 1,09,933 ట్రాన్స్‌జెండర్లు 7, మొత్తం ఓటర్లు 2,06,344 ఉన్నారు. ఆర్మూర్ పేరు చెప్తేనే టక్కున గుర్తుకొచ్చేది పసుపు రైతులు. ఇక్కడ పసుపు రైతులు పెద్ద ఎత్తున గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. ఆర్మూరు నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తారని భావించినప్పటికీ ఆయన కోరుట్ల వెళ్లడతో ఇక్కడ స్థానిక వార్ ఊపందుకొంది. ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే… రెడ్డి సామాజికవర్గం పదిన్నర శాతం ఉండగా, మున్నూరు కాపులు తొమ్మిదిన్నర శాతం ఉన్నారు. ముస్లింలు ఎనిమిదిన్నర శాతం, మాదిగల ఏడునన్నర శాతం, మాలలు 7 శాతం మేర ఉన్నారు. పద్మశాలీలు సైతం ఆరున్నర శాతం వరకు ఉన్నారు. ముదిరాజ్‌లు 5 శాతం, చాకలి 5 శాతం, యాదవులు 5 శాతం, వడ్డెరలు 5 శాతం మేర ఉన్నారు. ఇతరులు 30 శాతం వరకు ఉన్నారు.