బీఆర్ఎస్ ఓడితేనే తెలంగాణ బాగుపడద్ది, బీజేపీ గెలిస్తేనే బీసీ అభ్యర్థి సీఎం అవుతాడు-ఈటల
దళితుల సొంతకాళ్లపై బతకాలంటే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు కేసీఆర్. ఐతే, భూమి ఇవ్వకపోగా ఎన్నో ఏళ్ల కింద దళితులకు ఇచ్చిన ప్రభుత్వ పరమైన, దేవాలయ భూములు గుంజుకున్నారన్నారు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. TUWJ నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో ఈటల పాల్గొన్నారు. లాండ్ పూలింగ్ పేరుతో బ్రోకర్ లెక్క అమ్ముతున్నారన్నారు. అభివృద్ధి మండలాల పేరుమీద భూములు తీసుకొని అమ్ముకుంటున్నారని… గజ్వేల్‌లో 30 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారంతా కేసీఆర్ బాధితుల సంఘానికి నన్ను అధ్యక్షునికి చేసుకున్నారన్నారు ఈటల. ORR చుట్టూ ఉన్న 5800 ఎకరాల భూమి.. 10 నుండి 50 కోట్ల విలువైన భూములు లాక్కొని ఐటీ కంపెనీలకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారన్నారు. కేసీఆర్ పేదల కడుపుకొడుతున్నారన్నారు. దళిత జాతిని రోడ్డుమీద వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. భూమిని నమ్ముకున్న గిరిజనుల పొడు భూములను.. గుంజుకున్నారని, ధరణి తెచ్చి నడ్డి విరిచారన్నారు. బీసీబంధు అడుగులకు మడుగులు ఒత్తే వారికే ఇచ్చారన్నారు. దళిత బంధు 2 లక్షల కోట్ల స్కీమ్.. నేనే కుర్చీ వేసుకొని ఇస్తా అన్నారు. ఏ ఊర్లో వెళ్ళినా దళితుల మధ్య కొట్లాట పెట్టారని చెప్పారు. రింగ్ రోడ్డును 7800 కోట్లకు అమ్ముకొని, భూములు అమ్ముకొని రైతు రుణ మాఫీ చేశారని. కానీ వీరు ఇచ్చిన డబ్బు వడ్డీకే సరిపోయిందన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు 4800 కోట్ల బకాయి పడ్డారని ఈటల గుర్తు చేశారు. ధాన్యం కొనక… కొన్నా తరుగు పేరుతో క్విటాల్‌కి 10 కేజీలు కట్ చేసి రైతులను నిలువునా ముంచారన్నారు. దళితులు, గిరిజనులు, అన్నివర్గాల ప్రజలు కేసీఆర్ పాలనలో విసిగిపోయారన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తే రాష్ట్రం అధిగతిపాలు అవుతోందని జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు.

బీజేపీపై కొందరు పుకారుల పుట్టిస్తున్నారని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటున్నారని… అలా ఐతే తాను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు ఈటల రాజేందర్. TRS గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది తప్ప BJP ఎప్పుడూ పొత్తులేదన్నారు. హాంగ్ ఏర్పడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి అవుతాయి తప్పించి, కాంగ్రెస్ బీజేపీ పొత్తు ఉంటుందా? అని ఈటల ప్రశ్నించారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను నిలువరించే సత్తా ఉన్న పార్టీ అన్నారు. బంగారు తెలంగాణ చేసే సత్తా బీజేపీదే అని ప్రజలు భావిస్తున్నారన్నారు. మోదీ పాలనలో స్కాం లేదు.. దేశ ఆత్మగౌరవం పెరిగిందన్నారు. సుస్థిర పాలన అందిస్తున్నారని, 4 కోట్ల ఇల్లు కట్టించారన్నారు. కరోనా అప్పటినుండి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నారని, మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు 11 కోట్ల టాయిలెట్స్ కట్టారన్నారు. తెలంగాణలో ఊర్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్ర నిధులతో జరుగుతుందేనన్నారు.

రామగుండం ఎరువుల కర్మాగారం 6700 కోట్లు పెట్టి పునరుద్ధరించారని ఈటల గుర్తు చేశారు. నేషనల్ హైవే 2014 ఎంత వేశారో ఈ పదేళ్లలో అంత వేశారు అని స్వయంగా కేసీఆరే చెప్పారన్నారు ఈటల. రైల్వే స్టేషన్ అభివృద్ధి చూడాలన్నారు. తెలంగాణ నిజంగా అభివృద్ది జరగాలంటే బీజేపీ రావాలన్నారు. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అందరూ బీఆర్ఎస్‌లో చేరారన్న ఈటల, 2018లో 19 మందిని గెలిపిస్తే 13 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకొని కేసీఆర్ పంచన చేరారన్నారు. ఇప్పటి వరకు రెండు సార్లు కలిశారన్నారు. స్వాతంత్య్రం నుండి ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాలేదన్న ఈటల… 52 శాతం ఉన్నా… పరిపాలన అందని ద్రాక్ష అయ్యిందన్నారు. అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటిస్తే.. రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారన్నారు. గెలిపించేది రాహుల్ గాంధీ కాదు.. ఓట్లు వేసేది కాంగ్రెస్ వారు కాదు.. ప్రజలు. బీసీ బిడ్డలను రాహుల్ గాంధీ అవమనపరుస్తున్నారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీజేపీ అందుకే నవంబర్ 30 వ తేదీన బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఈటల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

