నీళ్లు, నిధుల, నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ అట్టర్ ఫ్లాప్-ఈటల
కేసీఆర్ అహంకారం తగ్గి ప్రజల వైపు, భూమి వైపు చూస్తున్నారన్నారు ఈటల రాజేందర్. అపార అనుభవం ఉంది, అన్నీ నాకు తెలుసు… ఈ సర్వేలేంటి అనే కేసీఆర్‌కి.. కాళ్ల కింద భూమి కదిలిపోతుందని అర్థమవుతోందన్నారు ఈటల రాజేందర్. రాష్ట్రం వచ్చాక మన నిధులు మన కోసమే ఖర్చుపెట్టినా.. రాష్ట్ర పురోగతి మాత్రం జరగడం లేదన్నారు. కొత్త రాష్ట్రంలో అప్పులు తెచ్చుకొనే వెసులుబాటు ఉంటే… ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ రుణాలు, FRBM రుణాలు సాచురేశన్ పద్ధతిలో తెచ్చుకోలేదన్నారు. కాబట్టి కొత్త రాష్ట్రంలో అప్పు తెచ్చుకొనే అవకాశం వచ్చిందన్న ఈటల, 74 వేల కోట్ల అప్పును, కేసీఆర్ ఐదున్నర లక్షల కోట్లు చేశారని విమర్శించారు. చౌరస్తాలో బిచ్చం ఎత్తుకునే బిడ్డపై లక్షా పాతిక వేల అప్పుందన్నారు. జీడీపీ కంటే 25 శాతం ఎక్కువ అప్పులు చేశారన్నారు. అప్పుల ఊబిలోకి రాష్ట్రం చిక్కుకుందన్నారు. రాష్ట్రంలో జీతభత్యాలు ఇవ్వడం లేదని, పింఛన్లు నెల నెలా ఇవ్వడం లేదని, డబుల్ బెడ్ రూం నిర్మించలేదని, వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని, నిధుల విషయంలో రాష్ట్రం దీనస్థితిలో ఉందన్నారు ఈటల. కేసీఆర్ చెబుతున్నట్టు తెలంగాణ ధనిక రాష్ట్రమైతే, డబుల్ బెడ్ రూం ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, బిల్లులు, పింఛన్ నెల నెలా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

రాష్టం వచ్చినప్పుడు 1.96 లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట మార్చారాన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉండనే ఉండదన్నారనిస, శ్రమ దోపిడీ అవుతుందన్నారని, ఏటా నియమకాలు చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. కేసీఆర్ వల్ల 30 లక్షల యువత అల్లల్లాడుతోందన్నారు. పిల్లలు కోచింగ్ తీసుకుంటూ, అర్ధాకలితో గడుపుతున్నారన్నారు. నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇస్తే, 17 పేపర్లు లీకయ్యాయన్నారు. నాడు గంటా చక్రపాణి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్నప్పుడు లీకులు లేవన్నారు. నిబద్ధత కల వారు ఉంటే అంతా సవ్యంగా జరిగిందని, అడుగులకు మడుగులు ఒత్తేవారిని, బానిస మస్తత్వం ఉన్నవారి వల్లే పేపర్లు లీక్ అయ్యాయన్నారు. కోర్టులు కూడా పరీక్షలు రద్దు చేయమని చెప్పాయని, ప్రభుత్వానికి సిగ్గుందా అని ఈటల ప్రశ్నించారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల కళ్లలో మట్టి కొట్టారన్నారు ఈటల.

ప్రాణహిత చేవెళ్ల వద్ద కడితే లాభం లేదు అని మాయమాటలు చెప్పి.. నా మెదడు కరగబోసి కడుతున్న.. సూపర్ ఇంజనీర్ అని, మానవ అద్భుతమని, కాంక్రీటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్నారని చివరాకరుకు ఏం జరిగిందో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. 180 రోజులు 2 టీఎంసీల చొప్పున 360 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తా అన్నారని, కానీ 2019 నుండి లిఫ్ట్ చేసింది కేవలం 172 టీఎంసీలు మాత్రమేనన్నారు. దానికోసం కట్టిన బిల్లులు 9 వేల కోట్లు.. బకాయిలు 6 వేల కోట్లు. వాడినా వాడకపోయినా 3500 కోట్లు ఫిక్స్డ్ చార్జీలు కట్టాల్సి వస్తోందన్నారు. వర్షానికి కన్నేపల్లి పంపు హౌజ్ గోడలు కూలి మోటార్లు చెడిపోయాయన్నారు ఈటల. ప్రజాధనం తో కట్టిన వాటిని చూడడానికి అనుమతి ఇవ్వకుండా ప్రజానీకానికి సమాచారం అందకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. మొన్న 19-22 పిల్లర్లు కుంగాయి. ఒక్కో పిల్లర్ లక్ష మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. 76 వేల క్యూబిక్ మీటర్ల సిమెంట్ వాడారు. అలాంటివి కుంగి పోవడమే కాదు మధ్యకు ఇరిగిపోయాయన్నారు. 5/6 పిల్లర్లు కింద ఇసుక పోవడం కాదు, మొత్తం ప్రాజెక్ట్ వాడడానికి వీలు లేదని… డాం సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందన్నారు ఈటల. అన్నారంలో బుంగలు పడ్డాయన్నారు. ఇసుక బస్తాలు వేస్తేనో, నీళ్లు తీస్తేనో సరిపోదని… మూడు ప్రాజెక్ట్‌లు రిపేర్ చేసిన పనికి వచ్చేలా లేవన్నారు. లక్ష కోట్ల డబ్బుతో కట్టిన ప్రాజెక్టులు ప్రశ్నార్థకంగా మిగిలాయన్నారు.