Home Page SliderInternational

ఐసిస్ కంటే హమాసే భయంకరంగా ఉంది..జో బైడెన్

అంతర్జాతీయ తీవ్రవాద ముఠా ఐసిస్ కంటే కూడా హమాస్ ఉగ్రవాదుల చర్యలే చాలా భయంకరంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించే ఉద్దేశంతో బైడెన్ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. తాజాగా జరిగిన ఆసుపత్రిపై దాడితో గాజా నగరం హృదయవిదారకంగా మారింది.  ఎటు చూసినా శవాల దిబ్బలతో స్మశానంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 500 మంది  ఈ దుర్ఘటనలో మరణించడంతో దీనికి కారణం మీరంటే మీరంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ ఆర్మీ.

13 రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంలో సామాన్యులు కూడా బలవుతున్నారు. వేల మంది మరణించారు. ఎటునుండి ఏడ్రోన్ వస్తుందో, ఏ రాకెట్ విరుచుకుపడుతుందో అని బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎటూ వెళ్లే దారి లేక శిథిలాల మధ్య, శవాల దిబ్బల మధ్య రాత్రయితే చిమ్మ చీకటిలో జీవచ్ఛవాల్లా బతుకున్నారు గాజా ప్రజలు. దీనితో అక్కడి సామాన్యప్రజలకు సహాయం చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. ఈజిప్టు కూడా రఫా వద్ద సరిహద్దులు తెరిచేందుకు అంగీకారం తెలిపింది. ఈజిప్టుతో కలిసి చైనా కూడా పనిచేస్తుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వెల్లడించారు. అలాగే గురువారం (నేడు) బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా ఇజ్రాయెల్‌ను సందర్శించనున్నారు. గాజా ఆసుపత్రి బాధితులకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా కూడా రూ.2.5 కోట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు గాజా ప్రజలకు సహాయం చేయడానికి ముందుకొస్తున్నాయి.