5 సీరియల్ హత్యలు 20 రోజుల్లేనే
ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన ఇద్దరు మహిళలు ఒక కుటుంబంపై పగబట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఐదుగురిని హతమార్చారు. ఈ వరుస మరణాలు అనుమానాస్పదంగా ఉండటంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హంతకుల గుట్టురట్టు చేశారు. ఓ మహిళకు ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలున్నాయి. మరో మహిళను అదే కుటుంబం వేధింపులకు గురిచేస్తోంది. దీంతో ఎలాగైనా ఆ కుటుంబాన్ని అంతమొందించాలని ఇద్దరూ కలిసి పథకం ప్రకారం ప్లాన్ వేశారు. దాన్ని అమలు పరిచి 20 రోజుల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఐదుగురి ప్రాణాలు బలి తీసుకున్నారు.
గడ్చిరోలికి చెందిన సంఘమిత్ర అనే మహిళకు తన అత్తమామలు, భర్త తీరు నచ్చలేదు. రోసా అనే మరో మహిళకు ఆ కుటుంబంతో ఆస్తి తగాదాలు ఉండటంతో ఇద్దరూ చేతులు కలిపారు. రంగు, రుచి, వాసన లేని ఓ నాటు మందును సేకరించారు. సెప్టెంబర్ 20న శంకర్ కుంభారే, అతని భార్య విజయ తినే ఆహారంలో దాన్ని కలిపారు. అది తిన్న తర్వాత వారికి తీవ్రమైన ఒళ్లునొప్పులు, ఆపైన గుండెనొప్పి వచ్చింది. నాగ్పూర్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 26న శంకర్ మరణించగా.. మరుసటి రోజు అతని భార్య విజయ చనిపోయింది. ఈ ఘటనను మరువకముందే శంకర్ దంపతుల కుమార్తెలు కోమల్, ఆనంద, కుమారుడు రోషన్ అస్వస్థతకు గురయ్యారు. బంధువులు ఆసుపత్రికి తరలించగా అక్టోబర్ 8న కోమల్ చనిపోగా.. 14న ఆనంద, మరుసటి రోజు రోషన్ కన్నుమూశారు. ఈ అనుమానాస్పద మరణాల్లో అందరిలోనూ అవయవాల జలదరింపు, తీవ్రమైన వెన్నునొప్పి, తలపోటు, పెదవులు నల్లగా మారడం, నాలుక మొద్దుబారడం వంటి లక్షణాలను డాక్టర్లు గుర్తించారు. వారంతా విషప్రభావానికి గురై ఉంటారని పోలీసులకు తెలియజేశారు.
విచారణలో భాగంగా పోలీసులు తొలుత సంఘమిత్రపై నిఘా ఉంచారు. ఆమె మృతుడు రోషన్ భార్య. మరో నిందితురాలు రోసా చనిపోయిన విజయకు మరదలి వరస అవుతుంది. సమీపంలోని ఓ ఇంట్లో ఈమె నివసిస్తోంది. రోసా భర్త పూర్వీకుల ఆస్తిని విజయ, ఆమె సోదరీమణులతో పంచుకోవడంపై ఆమెకు విభేధాలున్నాయి. దీంతో సంఘమిత్రతో చేతులు కలిపింది. వీరిద్దరూ కలిసి ఆన్లైన్లో ఏదైనా విషం దొరుకుతుందేమోనని వెదికారు. ఆ తరువాత రోసా ఓ ప్రాంతానికి వెళ్లి అంతుచిక్కని పాషాణం సేకరించి తీసుకొచ్చింది. ఈ కేసులో మరో దారుణం ఏమిటంటే. శంకర్, విజయ దంపతులను ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనూ విషం కలిపిన నీటిని రోసా వారికి తాగించింది. అందులో ఆయుర్వేద గుణాలున్నాయని చెప్పడంతో డ్రైవర్ కూడా ఆ నీటిని కొంత తాగినట్లు తెలిసింది. సంఘమిత్ర, రోసాలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

