Andhra PradeshHome Page Slider

లెక్క మారుస్తాడు.. సైంధవ్

నాకు కథల పైన.. ప్రేక్షకుల పైన నమ్మకం ఎక్కువ. మంచి సినిమా వస్తే సీజన్ ఏదైనా చూస్తున్నారు. 75 సినిమాల ఈ ప్రయాణంలో తెలుసుకున్నది అదే. విభిన్నమైన భావోద్వేగాలతో వినోదం పంచే చిత్రమిది. ఇందులో కొత్త వెంకీని చూస్తారన్నారు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం సైంధవ్. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. వెళ్లే ముందు చెప్పి వెళ్లా. వినలేదు. అంటే భయంలేదు. లెక్క మారుద్దిరా.. అంటూ టీజర్‌లో వెంకటేష్ యాక్షన్ అవతారంలో సందడి చేశారు. టీజర్ విడుదల అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ నా తొలి సినిమా నుంచి ఎంతో ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమ, ప్రోత్సాహంవల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది. ఈ సినిమాకి ముందు చాలా కథలు విన్నా. ఒక ప్రత్యేకమైన కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే శైలేష్ ఈ కథ చెప్పాడు. ప్రేక్షకులందరికీ చేరువయ్యే కథ కావడంతో పాటు, ఇప్పటివరకు నేను చేయని యాక్షన్ ఇందులో ఉంది. దాంతో వెంటనే ఒప్పుకున్నా. మంచి కథ వచ్చినప్పుడు తీసుకుని నిజాయితీగా చేయాలి. ఈ సినిమాలో అదే చేశాం. అందరూ కష్టపడి పనిచేశారు. చంటి, కలిసుందాం రా, లక్ష్మీ తదితర చిత్రాల తర్వాతనా సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా వస్తుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆస్వాదిస్తారన్నారు. పరిణితితో కూడిన ప్రేమకథలు కూడా సిద్ధం చేయమని రచయితలకి చెప్పానని, కచ్చితంగా ఆ తరహా చిత్రం చేస్తానని చెప్పారు వెంకటేష్. రానా నాయుడుకి కొనసాగింపుగా మరో సిరీస్ వస్తుందని ఆయన తెలిపారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు నా కోసం స్క్రిప్ట్‌లు సిద్ధం చేయిస్తున్నాయి. నాగా నాయుడు మళ్లీ వస్తాడు. రానా నాయుడు సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది. మొన్న అహ్మదాబాద్‌లో మ్యాచ్ చూడడానికి వెళ్లినప్పుడు నాగా నాయుడు అనే పిలిచారు నన్నంతా. తెలుగులో ఆ సిరీస్‌ని చేస్తానన్నారు వెంకటేష్.

చంద్రప్రస్థ చుట్టూ…

దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైన 75వ సినిమాని నా చేతిలో పెట్టినందుకు వెంకటేష్ సర్‌కి కృతజ్ఞతలు. వెంకీ మామకి పెద్ద విజయాన్ని ఇవ్వాలనే తపనతోనే అందరం కష్టపడి పనిచేశాం. చంద్రప్రస్థ అనే ఓ కల్పిత నగరం చుట్టూ సాగే కథ ఇది. ఆ నగరం ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు.  నవాజుద్దీన్ సిద్ధిఖీకి తెలుగులోకి స్వాగతం పలుకుతున్నా. ఆయన హైదరాబాద్ డెక్కనీ ఉర్దూ మాట్లాడే ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్రకి తగ్గట్టుగా స్వయంగా డబ్బింగ్ చెప్పారు. చాలా జాగ్రత్తలు తీసుకుని చేసిన సినిమా ఇది. చూసింది కొంచెమే, థియేటర్లలో ఈ సినిమాని మరింతగా ఆస్వాదిస్తారన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాట్లాడుతూ నేనే తొలి ఎంపికగా భావించి నా పాత్రని రాసుకున్నారు శైలేష్ కొలను. నన్ను ఎంపిక చేసిన దర్శకుడు శైలేష్‌కి కృతజ్ఞతలు. వెంకటేష్ అద్భుతమైన నటుడు. ఆయన వల్ల సెట్లో మరింత సౌకర్యవంతంగా నటించా అన్నారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ వెంకటేష్‌తో సినిమా చేస్తానని ఊహించలేదు. సైంధవ్‌తో నా కల నెరవేరిన అనుభూతి కలిగింది. ఆయనతో సినిమా చేసే అవకాశాన్ని అదృష్టంగా భావించా అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు రవివర్మ, ఛాయాగ్రాహకుడు మణికందన్, ఎడిటర్ గ్యారీ బీహెచ్ పాల్గొన్నారు.