Home Page SliderTelangana

ఈ బంధులన్నీ కేవలం ఎన్నికల సమయంలోనే, తర్వాత అన్నీ బందే..ఈటల

 దళిత బంధు, రైతుబంధు వంటి బంధులన్నీ కేవలం ఎన్నికల సమయంలోనే, ఎన్నికలయ్యాక అన్నీ బందేనన్నారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నేడు జరిగిన జమ్మికుంట మహాగర్జన సభలో కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈటల రాజేందర్. బీఆర్‌ఎస్ పథకాలపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటల. కేసీఆర్ దళిత బంధు, రైతు బంధు వంటి పథకాల పేర్లు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలు చేసి, ఎన్నికలయ్యాక అన్ని పథకాలు బంద్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈటల బహిరంగ సభలో మాట్లాడుతూ … “2021లో గెలుపు ఈటల రాజేందర్‌ది కాదు..హుజూరాబాద్ ప్రజలదే  నేను ఓట్లు కొనుక్కోలేదు. నేను మీబిడ్డనని చెప్పి ఓట్లడిగాను. అందుకే గెలిపించారు. కేసీఆర్ ఫొటోతో గెలిచావు, దమ్ముంటే రాజీనామా చేయమన్నారు టీఆర్‌ఎస్ పార్టీ. అలాంటి సమయంలో నన్ను అక్కున చేర్చుకుంది బీజేపీ పార్టీ. కేసీఆర్ ఉప ఎన్నికలో  కోట్లు కుమ్మరించినా ప్రజలు  ప్రలోభాలకు గురికాకుండా గెలిపించినందుకు రుణపడి ఉంటాను. తెలంగాణ  ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్,  అది నిజమే అయితే బీసీ బంధు, దళిత బంధు ఇంకా ఎందుకు ప్రజలకు అందలేదు. కేవలం బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్న వారికే పథకాలు వర్తిస్తున్నాయి. చరిత్ర నిర్మాతలు ప్రజలే అని హుజూరాబాద్ నిరూపించింది”. అని పేర్కొన్నారు.