Andhra PradeshHome Page Slider

జైలులో చంద్రబాబుకు ఏసీ వసతి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒకింత ఊరట లభించింది. ఆయన ఉన్న బ్యారక్ లో తక్షణమే ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు జైళ్ల శాఖను ఆదేశించింది. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై గత రెండు రోజులుగా కొనసాగుతున్న హై టెన్షన్ నేపథ్యంలో శనివారం మరింత ఆందోళన చోటుచేసుకుంది. ఆయన చర్మ సంబంధ సమస్యతో బాధపడుతున్నారని మరోవైపు బరువు తగ్గటం వల్ల కిడ్నీలపై దుష్ప్రభావం చూపి ప్రాణానికి ముప్పు పొంచి ఉందంటూ ఆయన కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుకు వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించాలని కోర్టును కోరారు. ఆయనకు చల్లని వాతావరణ పరిస్థితులు కల్పించాలని అవసరమైతే మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని అప్పటి వరకు జైలులో ఏసీ ఏర్పాటు చేయించేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. లేదంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుందని స్కిన్ ఎలర్జీ కారణంగా చల్లని ప్రదేశంలో ఉండాలన్న ప్రభుత్వ డాక్టర్ల సూచనలను పిటిషన్ లో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

చంద్రబాబు లాయర్ల హౌస్ మోషన్ పిటిషన్ పై అత్యవసర విచారణ సందర్భంగా జైలు అధికారులు వైద్యులతో మాట్లాడిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీంతో చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను శనివారం రాత్రి జడ్జి ఆదేశించారు. వైద్యుల సూచనలు అమలు చేయాలన్న కోర్టు ఆదేశాలతో చంద్రబాబు ఉన్న గదిలో ఏసీ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేశారు.