Andhra PradeshHome Page Slider

డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

జరుగుమల్లి: జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట 16వ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు కొంతమంది ప్రయాణికులతో తిరుపతి నుంచి విజయవాడ వైపుకు బయలుదేరింది. ఈ క్రమంలో జరుగుమల్లి మండలం కె.బిట్రగుంట సమీపంలోని ఫ్లై ఓవర్‌పై అదుపుతప్పి గేదెను ఢీకొట్టింది. అనంతరం డివైడర్‌ను ఢీకొని ఓ పక్కకు ఒరిగింది. దీంతో బస్సులో నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా బిగ్గరగా కేకలువేస్తూ భయాందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ గోపి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న టంగూటూరు హైవే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన బస్సు డ్రైవర్‌ను ఒంగోలు రిమ్స్‌కి తరలింపు. ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.