తెలంగాణ తుది ఓటర్ల జాబితా రెడీ -22లక్షల ఓట్ల తొలగింపు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా పూర్తి స్థాయిలో సమాయత్తమైనట్లు కేంద్రఎన్నికల సంఘం పేర్కొంది. దాదాపు 22 లక్షల ఓట్లను పరిశీలించి తొలగించినట్లు వెల్లడించారు. శాసన సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సమీక్ష కోసం వచ్చి పర్యవేక్షణ జరిపింది. వీరి పర్యటన నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో 2022-23 ఏడాదికి గాను 22 లక్షల ఓట్లను తొలగించినట్లుగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇతర కమిషనర్లతో కలిసి చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణలో స్త్రీ, పురుష ఓటర్లు దాదాపు సమానంగా ఉన్నారని, ఇది ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. యువ ఓటర్ల సంఖ్య 8లక్షలకు పైగా ఉందన్నారు. సమాజంలో అన్ని వర్గాల వారికీ ఓటింగ్‌లో భాగస్వామ్యం ఉందన్నారు. తాము ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించామని, ఏకపక్షంగా తొలగించలేదని పేర్కొన్నారు. దాదాపు 66 నియోజక వర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. 80 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుండే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తెలంగాణాలో మొత్తం 35,356 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో సగటు ఓటర్ల సంఖ్య 897 ఉందని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరిస్తామని, దీనికోసం ‘సీ విజిల్’ అనే యాప్‌ను ఉపయోగించమని ఓటర్లను కోరారు.

