Andhra PradeshHome Page Slider

ఈనెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ?

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 20వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం, ఫ్యామిలీతో యూకే పర్యటన ముగించుకొని ఈ నెల 12న రాష్ట్రానికి తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారని ఆ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈసారి జరగబోయే క్యాబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులపై చర్చించటంతో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేస్తారని భావిస్తున్నారు.ఈసారి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పాటు నిర్వహించవచ్చని సమాచారం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఇన్ని రోజులపాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లోనే చాలా కీలకమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నదని ప్రచారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉంది. అయితే జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినట్లయితే ఇవే చివరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అవుతాయని కూడా అందరూ భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికలకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతూ ప్రజలకు మరింత మేలు చేసే పలు కొత్త పథకాలను తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే అనేక కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.