సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న జగన్
- వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల బరికి సిద్ధం
- పలు అంశాలపై తీవ్రంగా కసరత్తులు
- సెప్టెంబర్ లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- నవరత్నాలతో పాటు మరింత సంక్షేమాన్ని ప్రజలకు అందించేలా చర్యలు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైయస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు పార్టీపై పూర్తిస్థాయి పట్టు సాధించుకుంటూ మరొకవైపు పరిపాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన వారం రోజులుగా ఆయన పలు అంశాలపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కూడా సెప్టెంబర్ నెల మొదటి వారంలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలను కీలకంగా నిర్వహించాలని ఆయన భావిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టాల్సిన బిల్లులు ఆమోదం తెలపాల్సిన పథకాలు నిధుల సమీకరణ కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించడం తదితర అంశాలపై కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్లు ఆయా రంగాల్లో నిష్ణాతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

గతంలో ఎదురైన అనుభవాలను క్రోడీకరిస్తూ ఈసారి అటువంటి పరిస్థితిలు ఎదురైతే తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రస్తుతం అమలవుతున్న నవరత్నాలకు సంబంధించి మరింత సంక్షేమాన్ని అందించేలా చర్యలు తీసుకోబోతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను కూడా మరింతగా పెంచేందుకు విధివిధానాలను ఖరారు చేయాలని భావిస్తున్నారు. విజయదశమి నాటికి పార్టీలో అభ్యర్థులను కూడా ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల పరిధిలో 36 మంది అభ్యర్థుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని గుర్తించినట్లు సమాచారం. వీరు దసరా లోపు తమ పనితీరును మెరుగుపరుచుకుంటే అవకాశం కల్పించే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై కూడా వచ్చే నెల ఆఖరిలో కానీ అక్టోబర్ మొదటి వారంలో కానీ చివరి సమీక్ష నిర్వహించాలని అధినేత నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈసారి జరిగే సమీక్ష నాటికి నేతల పనితీరు బాగుంటే ఉంచటం లేదంటే మరో అవకాశం లేకుండా నిర్మొహమాటంగా వారికి చెప్పేయాలని కూడా జగన్ కఠిన నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. చివరి వర్క్ షాప్ నాటికి పనితీరు బాగుంటే టికెట్ ఖరారు చేయాలని లేదంటే నిర్మోహమాటంగా చెప్పాలని జగన్ ఆలోచన చేస్తున్నారు. ఇలా పలు రకాలైన కీలక నిర్ణయాలు తీసుకుంటూ వివిధ అంశాల పై కసరత్తులు చేస్తూ జగన్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు.

