ఏపీలో రెండు పార్టీలు ఉగాదిలోగా గల్లంతు: బొత్స సత్యనారాయణ
ఏపీలో వచ్చే ఉగాదిలోగా తెలుగుదేశం, జనసేన పార్టీలు గల్లంతు అవుతాయని అలా కాని పక్షంలో తాను గుండు గీయించుకుంటానని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనుభవం ఉన్న నాయకునిగా పేరు చెప్పుకుంటూ అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేయాలనుకున్న నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రణస్థలం మండల కేంద్రంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయోత్సవ సభ స్థానిక శాసనసభ్యుడు కిరణ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల రాజకీయాలు కొంత నిరాశను కలిగిస్తున్నాయని కొంతమంది అవగాహన లేక ఏక వచనంతో తప్పులు మాట్లాడుతున్నారని ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రం మంచిది కాదని పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శించారు. ముఖ్యమంత్రిని, మంత్రులను ఏక వచనంతో చెప్పులు, చేతులు చూపించి మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికి చెప్పులు చేతులు ఉంటాయన్న సంగతి వారు గుర్తించాలన్నారు. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మాట్లాడటం రాజకీయాలులో సరికాదన్నారు. అటువంటి వ్యక్తులను ప్రజలు ఛీ కొడతారని రాజకీయాలు హుందాగా ఉండాలని సద్విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదన్నారు.


