Andhra PradeshHome Page Slider

ఈ ఏడాది పొగాకు ఉత్పత్తిని 170 మిలియన్ కిలోలకు పెంచాలి

ఆంధ్రాలోని ‘ఎఫ్‌సీవీ’ పొగాకు ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, దాని పరిమాణాన్ని 2023–24 పంట సీజనులో 170మిలియన్‌ కిలోలకు పెంచితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయపడింది. వైసీపీ ఎంపీలు కేంద్ర వాణిజ్య శాఖ అడిషనల్‌ సెక్రటరీ రాకేశ్‌ అగర్వాల్‌ను అభ్యర్థించారు.2023– 24 పంట సీజనుకు ఆంధ్రప్రదేశ్‌లో వర్జీనియా పొగాకు ఉత్పత్తి పరిమాణం గతేడాది మాదిరిగానే 142 మిలియన్‌ కిలోలుగా ఉండాలని జులై 17, 2023 న జరిగిన సమావేశంలో పొగాకు బోర్డు తీర్మానించిందని ఈ పరిమాణాన్ని 170మిలియన్‌ కిలోలకు పెంచాలని వైసీపీ ఎంపీలు కోరారు. వైసీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కోటగిరి శ్రీధర్‌, మార్గాని భరత్‌ కలసి వినతిని కేంద్ర సెక్రటరీకి అందజేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వర్జీనియా పొగాకు ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, ఇప్పటికీ పొగాకు అవసరం, ఎగుమతులకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని వినతిలో పేర్కొన్నారు. కనుక, ఉత్పత్తి పరిమాణాన్ని పెంచితే పొగాకు రైతులు మరింత రాబడి పొందెందుకు వీలు కలుగుతుంది అని, అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని వివరించారు. ఈ విషయంలో చొరవ చూపి బోర్డు వారితో సంప్రదింపులు చేసి.. ప్రస్తుతం నిర్ణయించిన 142 మిలియన్‌ కిలోల ఎఫ్‌సీవీ పొగాకు పరిమాణాన్ని 170మిలియన్‌ కిలోలకు పెంచాలని విన్నవిస్తూ.. ఈ పెంపు ద్వారా లక్షలాది మంది పొగాకు రైతులకు, ఈ రంగంలో ఉండే వారి జీవన పరిమాణాన్ని పెంచుటకు తోడ్పడుతుందని కోరారు. ఈ విషయంలో కేంద్ర సెక్రటరీ రాకేశ్‌ అగర్వాల్‌ సానుకూలంగా స్పందించినట్లు వైసీపీ ఎంపీలు తెలియజేశారు.