Home Page Slider

కన్నీరుమున్నీరవుతున్న ‘మోరంచ’ ప్రజలు

హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా తీవ్ర ఇబ్బందులకు లోనయిన మోరంచ గ్రామ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. వరదలలో చిక్కుకున్న మోరంచ ప్రజలను కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది. రహదార్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వ హెలికాఫ్టర్లను, వాటర్ బోట్లను ఉపయోగించారు. అయితే వరద తీవ్రత తగ్గి తిరిగి తమ గ్రామానికి చేరుకున్న వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. వరద నీరు పూర్తిగా ముంచెత్తడంతో వారి ఇళ్లు, వస్తువులు బాగా దెబ్బతిన్నాయి. వారు ప్రాణ ప్రదంగా పెంచుకుంటున్న పశువులు ప్రాణాలు కోల్పోయాయి.

హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా వారు ఇళ్లపైకప్పులు, చెట్లపై ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అనంతరం ప్రభుత్వ సహాయంతో బయటపడ్డారు. ఇప్పుడు వారు తిరిగి వెళ్లి తమ పశువులను, ఇళ్లను, వస్తువులను చూసి దుఖాఃన్ని ఆపుకోలేకపోతున్నారు. పూర్తిగా నష్టపోయి కట్టుబట్టలతో నిలిచిపోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారు కోలుకునే వరకు మరో పది రోజుల పాటు వారికి బట్టలు, ఆహారం, పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.