“ప్రతిపక్ష నాయకులు చేయగలిగితే బయటకు వచ్చి ప్రజలకు సేవ చేయండి”:KTR
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణాలోని వాగులు,వంకలు,నదులు ఉప్పొంగుతూ ప్రవహిస్తున్నాయి. మరోవైపు తెలంగాణాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి కూడా నిండు కుండళ్లా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణాలో భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కొందరు ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం,ప్రభుత్వ యంత్రాగం చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసే పనిలో నిమగ్నమైందన్నారు. ప్రతిపక్ష నాయకులు చేయగలిగితే బయటకు వచ్చి ప్రజలకు సాయం చేయండి అన్నారు.అంతేకానీ చిల్లర విమర్శలు మాత్రం చెయ్యొద్దని కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో రాజకీయాలకు కూడా ఓ టైమ్ ఉంది అని కేటీఆర్ గుర్తుచేశారు.కాగా రాష్ట్రంలో ఎక్కడైనా భవనాలు శిథిలావస్థలో ఉంటే అక్కడి నుంచి ప్రజలు తరలిరావాలని కేటీఆర్ సూచించారు. ఎక్కడైనా కల్వర్టులు,బ్రిడ్జ్‌లు ప్రమాదకర పరిస్థతిలో ఉంటే వాటి గురించి సమాచారం అందించాలని కేటీఆర్ ప్రజలను కోరారు. ఇలా చేయడం ద్వారా వాటి నుంచి నష్టం జరగకుండా చూస్తామన్నారు. అయితే వర్షాలు తగ్గాక కూడా అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్ను ఆదేశించామన్నారు. కాగా ప్రభుత్వ అధికారులకు సెలవులు కూడా రద్దు చేశామని కేటీఆర్ వెల్లడించారు. ఈ విధంగా తెలంగాణా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలతో చాలా అప్రమత్తంగా ఉంది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

