రష్యాపై నిఘాకు ఉక్రెయిన్ కోసం అమెరికా అతిచిన్న మైక్రో డ్రోన్స్
రష్యాపై నిఘాకు ఉక్రెయిన్‌కు సహకరించే విధంగా రూపొందించిన అతి చిన్న మైక్రో డ్రోన్లను అమెరికా బహుమతిగా అందజేస్తోంది. వీటి బరువు కేవలం 33 గ్రాములే. వీటిని చాలా సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. రష్యాపై ఎదురుదాడులు చేయడానికి ఇలాంటి అత్యాధునిక ఆయుధాల అవసరం ఎంతో ఉంది. వీటికోసం 400 మిలియన్ డాలర్ల ప్యాకేజీని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. బ్లాక్ హార్నెట్ నిఘా డ్రోన్లను ఉక్రెయిన్‌కు అందజేస్తున్నారు. 2022లో కూడా 850 మైక్రో డ్రోన్లను ఉక్రెయిన్‌కు బ్రిటన్, నార్వే అందించాయి. ఈ డ్రోన్లు కంట్రోల్ చేయడానికి జాయ్ స్టిక్ వంటి పరికరం సరిపోతుంది. ఇవి శత్రు స్థావరాలలో నిశ్శబ్దంగా ప్రయాణించి, తక్కువ క్లారిటీ గల వీడియోలను తీయగలవు. వివిధ ప్రాంతాలలో రష్యన్ సైనికుల కదలికలను ముందే గమనించవచ్చు. రాత్రివేళలో కూడా ప్రత్యేక పరికరాలు అమర్చి వీటితో చిత్రాలు తీయవచ్చు. తాజా ప్యాకేజిలో ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు, నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు మిసైల్స్, స్టింగర్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్, హిమార్స్ రాకెట్ వ్యవస్థలు, స్ట్రైకర్ సాయుధ కవచ వాహనాలు, పలు రకాల రాకెట్లు కూడా అందించనున్నారు. వీటిని కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఈ ఆయుధాలను అధ్యక్షుని ప్రత్యేక అధికారాల ద్వారా సరఫరా చేస్తున్నారు.

