పార్టీ నిర్ణయమే శిరోధార్యం- కిషన్ రెడ్డి స్పందన
తెలంగాణ బీజేపీ చీఫ్‌గా తనను ప్రకటించడంపై మొదటి సారిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పెదవి విప్పారు. తనకు పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. దిల్లీలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీకి విధేయుడనని, అధిష్టానం నిర్ణయించిన ప్రకారమే ముందడుగు వేస్తానని తెలియజేశారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, కేంద్రమంత్రిగా కొనసాగుతానా లేదా అనేది కూడా అధిష్టానం నిర్ణయం ప్రకారమే జరుగుతుందన్నారు. పార్టీని తాను ఏనాడూ ఏదీ కావాలని అడగలేదని, పార్టీయే తనకు మంత్రిపదవితో పాటు అన్నీ ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈరోజు దిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీకి వెళ్లకుండా తన నివాసంలోనే ఉన్నారు. ఈ సాయంత్రం తిరిగి దిల్లీ నుండి హైదరాబాద్ బయలు దేరబోతున్నారు. ఇక్కడ నేతలు, అదికారప్రతినిధులతో సమావేశంలో పాల్గొనవలసి ఉంది. ప్రధాని మోదీ వరంగల్ సభ జూలై 8న ఉండడంతో నిర్వహించవలసిన కార్యక్రమాలు, సమావేశాలపై చర్చించడానికి కిషన్ రెడ్డి గురువారం ఉదయం వరంగల్ బయలు దేరుతారు. అక్కడి ఏర్పాట్ల పర్యవేక్షణకు జూలై 8 వరకు అక్కడే ఉండే అవకాశం ఉంది.

