కేసిఆర్ ప్రజలను కాదు డబ్బులు నమ్ముకున్నారు
కేసిఆర్ ప్రజలను కాదు డబ్బులు నమ్ముకున్నారని,ఉత్సవాల పేరుతో ప్రభుత్వ సొమ్ముతో ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. జనగామ జిల్లా చేర్యాలలో బీజేపీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈటల. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, పెన్షన్, కేసిఆర్ కిట్, రైతుబందు అన్నీ ఇస్తున్నారు అందుకే ఆయనకే ఓటు వేయాలని చెప్పుకుంటున్నారు. కానీ ఆ డబ్బులు ఎక్కడనుండి వస్తున్నాయి. గొర్లతోనే గొర్రెల కాపరి బ్రతుకుతున్నాడని ఆ అమాయక గొర్లకు తెలియదు. వాటిలాగా మనం కూడా అమాయకంగా ఉండవద్దని హితవు పలికారు. కేసిఆర్ ఇచ్చే ప్రతి రూపాయి మనదే అనే వాస్తవం తెలుసుకోండి..తాగుడు ద్వారా కేసిఆర్ ప్రజల నుండి లాక్కునే డబ్బు 45 వేల కోట్లు.కేసిఆర్‌కు దమ్ముంటే బెల్ట్ షాపులు, రోడ్ల మీద బ్రాందీ షాపులు బంద్ పెట్టాలన్నారు. తెగిబడ్డ పుస్తెల సాక్షిగా ఆడబిడ్డల ఆక్రందనలకు అడ్డుకట్ట వేయాలన్నారు.

సిద్దిపేటలో 350 ఎకరాల భూములు చాలా చౌకగా కేసీఆర్ కొట్టేశారని మండిపడ్డారు ఈటల. ఇక్కడ కలెక్టర్ అందమైన భవనాల కింద దళితుల ఆర్తనాదాలు ఉన్నాయన్నారు. అలాగే వర్గల్, ఒంటిమామిడి నస్కల్ లో మూడు వేల ఎకరాలు తీసుకున్నారు. కేసిఆర్ ను గెలిపించిన పాపానికి మన భూములు లాక్కుంటున్నాడు. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా రైతులకు డబ్బు ఇస్తా అని పోతున్న కేసిఆర్ మన దగ్గర కౌలు రైతులు చచ్చిపోతున్నా పట్టించుకోవడం లేదు. మన సొమ్ముతీసుకుపోయి అక్కడ దానం చెయ్యడానికి నువ్వు ఎవడు? అని ప్రజలు అడగాలన్నారు.

ప్రధాని మోదీ నా కుటుంబం 140 కోట్ల కుటుంబం నాది అంటారు..నేను సేవకున్ని తప్ప, ఓనర్‌ని కాదు అని చెప్తారు. కానీ కెసిఆర్ మాత్రం అన్నీ నేనే ఇస్తున్నా అంటున్నారు. తేడా గమనించాలన్నారు ఈటల రాజేందర్.మోదీ గారికీ కుటుంబం లేదు, ప్రజలే కుటుంబం. బీజేపీ నీ నిండు మనసుతో ఆశీర్వదించండి.. మెచ్చే పాలన అందిస్తాం అని ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు.

