తెలంగాణ బీజేపీ విబేధాలు-కిషన్ రెడ్డికి కూడా దిల్లీకి పిలుపు
తెలంగాణ బీజేపీలో విబేధాలు పీక్స్‌కు చేరాయి. శుక్రవారం రాష్ట్ర బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డిలను దిల్లీకి పిలిపించిన బీజేపీ అధిష్టానం మంత్రి కిషన్ రెడ్డికి కూడా దిల్లీకి రావాలని ఆదేశించింది. పార్టీలో విబేధాలపై అమిత్ షా, జేపీ నడ్డా ఆరాలు తీస్తున్నారు. ఈ సందర్భంలో కిషన్ రెడ్డిని పిలిపించినట్లు తెలుస్తోంది. దీనితో కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని తన కార్యక్రమాలు రద్దు చేసుకుని దిల్లీకి బయలుదేరారు. అక్కడ ఈటల, రాజగోపాల్ రెడ్డిలతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇంటింటా బీజేపీ కార్యక్రమంలో పాల్గొనకుండా ఈటల, రాజగోపాల్ రెడ్డిలు కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనితో అధిష్టానం వారిని బుజ్జగించే పనిలో పడింది. వారికి తగిన బాధ్యతలు అప్పగించబోతోందని సమాచారం. వీరిద్దరూ పార్టీ మారుతారనే ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. పార్టీ నేతల మద్య ఆధిపత్య పోరును నివారించాలని అధిష్టానం నిర్ణయించింది.