అమెరికా కాంగ్రెస్‌లో మోదీ చారిత్రాత్మక ప్రసంగం
ఉగ్రవాదం విషయంలో భారత్ ఎవ్వరినీ ఉపేక్షించదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అమెరికా కాంగ్రెస్‌లో ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు మోదీ. భారతీయ అమెరికన్లు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. 40 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగంగా ఉన్నారని, భారత్, అమెరికా దేశాల మధ్య మైత్రి వల్ల ప్రపంచ శాంతి, సుస్థిరత పెరుగతాయన్నారు. ఐక్యరాజ్యసమితిలో కాలానుగుణంగా సంస్కరణలు జరగవలసిందేనని ప్రధాని గట్టిగా చెప్పారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి దేశాలపై పురిగొల్పే దేశాలను ఉపేక్షించేది లేదని, ఇది యుద్దాలకు సమయం కాదని తెలియజేశారు. ప్రతీ దేశం యొక్క ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ సమన్వయం చేసుకుంటూ దేశాలు ముందుకు సాగాలన్నారు. ఆప్రికన్ యూనియన్‌కు జీ-20 లో పూర్తి సభ్యత్వం ఉండాలన్నారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఈ యుద్ధ నివారణకు అన్ని దేశాలు కలిసి కట్టుగా కృషి చేయాలన్నారు.

మైనారిటీలపై భారత దేశానికి ఎలాంటి వివక్ష ఇప్పటివరకూ లేదని, ఇకమీదట ఉండబోదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యమే తమ మతమని, రాజ్యాంగ పరిరక్షణనే తమ ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం సబ్ కాసాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్ అనే స్లోగన్‌తో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని ఆయన నినాదాలు చేశారు. మోదీ ఈ ప్రసంగంలో ప్రతీ మాటకూ కరతాళధ్వనులు మిన్నంటాయి.