అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి
తెలంగాణాలో నేడు అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో TPCC ఛీఫ్ రేవంత్ రెడ్డి అమర వీరుల స్థూపం నిర్మాణంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణా ఉద్యమంలో 1569మంది అమరులయ్యారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణాలో త్యాగాలకు పాల్పడినవారిని అవమానించేలా BRS ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. అమరవీరుల స్థూపం వద్ద వారి పేర్లు రాయకుండా కేవలం అమరవీరులకు జోహార్లు అని మాత్రమే రాశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమరవీరుల స్థూపం నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాగా ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పరిసరాల్లో అమరవీరుల స్మారక స్థూపాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. తుది మెరుగులు కూడా దిద్దారు. ఈ స్మారక భవనాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మరికాసేపట్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనాల రాకపోకల వల్ల ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది. సాధారణ ప్రజలకు అసౌకర్యాలను తగ్గించేందుకు కొన్ని ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ వంటి ప్రదేశాలను ఇవాళ ప్రారంభోత్సవం దృష్ట్యా మూసివేయనున్నారు.