కొత్త దేవుడి అవతారమెత్తిన దొంగస్వామి
మహా విష్ణువు అవతారంలో ప్రజలను బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తున్నాడో దొంగ స్వామీజీ. జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలంలో జరిగింది ఈ సంఘటన. తాను అవతార పురుషుడినని, మహావిష్ణువునని, రంగనాథస్వామినని ప్రజలకు చెప్పుకుంటున్నాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. సాక్షాత్తూ మహావిష్ణువే మానవావతారంలో వచ్చాడంటూ అతడిని చూడడానికి ఎగబడ్డారు ప్రజలు. రాత్రి దేవుడు కలలోకి వచ్చి నువ్వే శ్రీరాముడు, నువ్వే శ్రీకృష్ణుడు అని చెప్పాడట సురేష్ అనే వ్యక్తికి. పైగా తెలంగాణాకు వెళ్లి భక్తుల పూజలందుకోమని చెప్పాడట దేవుడు. తాను తిరుపతి వెంకన్న కూడా నేనేనంటున్నాడు. తాను అలిసిపోయానని, ఇక పడుకుంటానని, ఈ ప్రదేశంలోనే తాను చివరి వరకూ ఉంటానని, తన విగ్రహం తన తుది దశలో తయారవుతుందని గుడి కట్టమని అక్కడి వారిని కోరుతున్నాడు.

శ్రీరాముని కాలంలో లక్ష్మణుడు ఇప్పుడు తన కొడుకుగా పుట్టాడని చెప్తున్నాడు. ఇతని మాటలు గుడ్డిగా నమ్మిన ప్రజలు వేంకటేశ్వరస్వామి గుడి వద్ద పొలంలో స్థలం కేటాయించగా, అక్కడే సెటిలయ్యాడు. అతడికి ఇద్దరు భార్యలు ఉండడంతో వారితో పాదసేవ చేయించుకుంటూ రంగనాథస్వామి ఫోజులు కొడుతున్నాడు. ఇంకేముంది రకరకాల ప్రవచనాలు, బోధనలు మొదలుపెట్టారు. తాను అవతారమూర్తినని నమ్మిస్తున్నాడు. ఆదివారం అమావాస్య కావడంతో అతడిని చూడడానికి పోటెత్తిన జనాలతో ఈ ఆలయ సమీపంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని లాకెళ్లి లాకప్‌లో పడేశారు.

