తిరుపతి అగ్ని ప్రమాదానికి గంగమ్మ జాతరకు ఏం సంబంధం?
తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫొటో ఫ్రేముల తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. గత 6 గంటలుగా తిరుపతి అగ్ని మాపక సిబ్బంది ఎంతగా కృషి చేస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీనికి తీవ్రమైన ఎండవేడిమి కూడా కారణం కావచ్చంటున్నారు. ఈ సందర్భంలో కొందరు టీడీపీ నేతలు తిరుపతిలోని గంగమ్మ జాతర సరిగ్గా చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనితో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వారికి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ వారు ప్రమాదంలో కూడా చలి కాచుకునే రకం అని ఎద్దేవా చేశారు. ఈ ప్రమాదంలో 8 బైకులు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం ఏర్పడిన లావణ్య ఫొటోవర్క్స్‌తో పాటు దగ్గరలోని మరో ఆరు దుకాణాలకు కూడా మంటలు వ్యాప్తి చెందాయి.మరోపక్క గోవిందరాజస్వామి రథానికి మంటలు అంటుకున్నాయంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దని అధికారులు పేర్కొన్నారు. రథాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించామని తెలియజేశారు. పెద్ద ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగానే పవర్ కట్ చేశామని తెలిపారు. ఇంకాసేపట్లో మంటలు అదుపులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద స్థలాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సందర్శించారు.

