Home Page SliderTelangana

బాసర ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలపై విద్యామంత్రి ఏమంటున్నారు

రెండు రోజుల వ్యవధిలోనే బాసర ట్రిపుల్ ఐటీలో బాలికల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితమే దీపిక అనే పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా, లిఖిత అనే మరో పీయూసీ విద్యార్థినే బాసర ఆర్జీయూకేటీలో నాలుగవ అంతస్తు నుండి కిందపడి చనిపోయింది. తీవ్రగాయాలతో భైంస ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం వైద్యుల సలహాపై మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ దురదృష్టవశాత్తూ ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలియజేశారు.

ఇది ప్రమాదవశాత్తూ జరిగిందని ఆర్జీయూ కేటీ ఇంచార్జ్ వీసీ తెలియజేస్తున్నారు. ఆమె సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన బుర్ర రాజు, రేణుక అనే దంపతుల పెద్ద కుమార్తె. రాజు గజ్వేల్‌లో మిర్చిబండి నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. వారం క్రితమే లిఖిత హాస్టల్‌కు వెళ్లిందని తెలియజేశారు. ఈ విషయంపై తెలంగాణా విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ ఈ వరుస సంఘటనలు బాదిస్తున్నాయని, దీపిక మరణంపై కమిటీ వేశామని, విచారణ కొనసాగుతోందని తెలియజేశారు. పూర్తి వివరాలు తెలిసాక, మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు. అలాగే లిఖిత మరణంపై కూడా సమాచారం సరిగ్గా లేదని, తెలుసుకుంటున్నామని, విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.