8 రాష్ట్రాలపై విరుచుకు పడుతున్న బిపర్‌జోయ్ తుపాను
బిపర్‌జోయ్ తుపాన్ భారీ స్థాయిలో విజృంభిస్తోంది. దీని ప్రభావం 8 రాష్ట్రాలపై చూపుతోంది. పలు రాష్ట్రాలలో వర్షాలు పడే అవకాశముంది. గుజరాత్, మహారాష్ట్రలపై తీవ్రప్రభావం చూపనుంది. కచ్, సౌరాష్ట్ర జిల్లాలలో ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తోంది. గుజరాత్‌లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. గురువారం సాయంత్రానికి ఈ తుపాను గుజరాత్‌లోని జఖౌ పోర్టు సమీపంలో తీరం దాటుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ సమయంలో భారీనష్టం కలిగిస్తుందని, ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే తరలించారు.

అమిత వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, భారీ ఆస్థినష్టం జరగవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ వ్యాప్తంగా కచ్, ద్వారక, జామ్ నగర్, మోర్బీ, పోర్ బందర్, రాజ్‌కోట్, జునాగఢ్ జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రాంతాలలో మూడురోజులపాటు అతిభారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాలలో 25 సెంటీమీటర్ల వరకూ కూడా వర్షం కురిసే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే 40 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ముమ్మురంగా పని చేస్తున్నాయి.

గుజరాత్‌తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా వంటి రాష్ట్రాలు కూడా తుపాన్ ప్రభావానికి గురయ్యాయి. వీటితో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, లక్షద్వీప్, డామన్‌డయ్యూ వంటి ప్రాంతాలు కూడా అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, ఉదయపూర్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

