పల్నాడు జిల్లాలో జగనన్న విద్యాకానుక కిట్లు అందజేసిన సీఎం జగన్
పల్నాడు జిల్లా క్రోసూరులో ఏపీ సీఎం జగన్ స్వయంగా జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ కిట్లు ఈ రోజు అందజేయనున్నారు. స్కూలు బ్యాగులో మూడు జతల యూనిఫామ్‌లు, పుస్తకాలు, తెలుగు -ఇంగ్లీషులలో సబ్జెక్ట్ పుస్తకాలు, ఒక జత షూస్, రెండుజతల సాక్సులు, బెల్టు, డిక్షనరీ కూడా ఇస్తున్నామని జగన్ సభలో తెలియజేశారు. విద్యాకిట్ల కానుక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఆయా స్కూళ్లలో పిల్లలకు అందజేస్తారని తెలియజేశారు. వీటికోసం ఒక్కొక్క కిట్ 2,400 రూపాయల వ్యయం అవుతోందని పేర్కొన్నారు. మొత్తం 43 లక్షల మంది పిల్లలకు వెయ్యికోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి వీటిని అందజేస్తున్నామన్నారు.

ఇది విద్యావ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవం అని, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసే విధంగా విద్యను అందజేస్తున్నామని, దీనికోసం ‘బై లింగ్వల్ టెస్ట్‌బుక్స్'(ఇంగ్లీషు-తెలుగు) కూడా ఇస్తున్నామన్నారు. దీనితో వారు ఈజీగా ఇంగ్లీషును కూడా అర్థం చేసుకొని ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి ఉన్నతోద్యోగాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం అమెరికా సంస్థ అయిన ‘ప్రిన్స్టన్’ సంస్థతో ఒప్పందం చేసుకుని, దాని ద్వారా ‘టోపెల్’ అనే సర్టిఫికేట్‌ను పరీక్షలు నిర్వహించి, వారికి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఇస్తామన్నారు. మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బాగా చెప్పడానికి, ప్రోత్సహించడానికి వారిని అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపిస్తామని వెల్లడించారు. రాబోయే రోజులలో మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జీపీటీ వంటి పాఠ్యాంశాలు కూడా ప్రవేశపెడతామని తెలియజేశారు.

