అత్యధిక ‘గ్రాండ్‌స్లామ్స్’తో జకోవిచ్ గ్రేట్ రికార్డ్
సెర్భియాకు చెందిన టెన్నిస్ ఆటగాడు జకోవిచ్ ఏకంగా 23సార్లు ‘గ్రాండ్‌స్లామ్స్’ సాధించి చరిత్రను తిరగరాశాడు. టెన్నిస్‌లో ఒక్క గ్రాండ్‌స్లామ్ సాధించినా వారు ఎంతో గొప్ప ఆటగాడిగా చలామణీ అవుతారు. అలాంటిది గతంలో ఎవ్వరూ సాధించని విధంగా ‘నభూతో నభవిష్యత్’ అనే విధంగా పురుషుల సింగిల్స్‌లో ఈ రికార్డును సాధించారు. ఆస్ట్రేలియా ఓపెన్‌ను 10 సార్లు, వింబుల్డన్‌ను 7 సార్లు ,యుఎస్ ఓపెన్‌ను 3 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడుసార్లు గెలిచి అందరినీ వెనక్కు నెట్టారు జకోవిచ్. తర్వాత స్థానాలలో టెన్నిస్ క్రీడలో అతిరథ, మహారథులైన నాదల్ 22 గ్రాండ్‌స్లామ్స్‌తో, ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్స్‌తో రెండు,మూడు స్థానాలకు పరిమితమయ్యారు.

అసలు జకోవిచ్ టెన్నిస్ ఆటలో అడుగుపెట్టినప్పుడు నాదల్, ఫెదరర్‌లు ఈ ఆటలో దిగ్గజాలుగా ఉండేవారు. వారి దరిదాపులకు కూడా ఏ ఆటగాడు వెళ్లలేకపోయేవాడు. అలాంటిది వారిని ఢీకొట్టి, వారిపై గెలుపు సాధించడం మామూలు విషయం కాదు. ఎన్నోసార్లు వారి చేతుల్లో పరాజయం పాలయ్యినా, నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించడమే అతని గెలుపుకు నాంది.

