Home Page SliderNationalTrending Today

కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ బాటలోనే ఈ ’72 హురైన్’ సినిమా ఉంటుందా?

ఈ మధ్య విడుదలైన ‘కేరళ స్టోరీ’, అంతకు ముందే విడుదలై సంచలనం సాధించిన ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాలు మత పరమైన చర్చలకు దారి తీసాయి. ఇప్పుడు ’72 హురైన్’ అనే సినిమా టీజర్ చూస్తే ఇది కూడా వాటి బాటలోనే నడుస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘అల్లాహో అక్బర్’ అంటూ సాగే ఈ టీజర్ కూడా అదే ఉద్దేశాన్ని వెల్లడి చేస్తోంది. ‘హురైన్’ అరబ్ భాషలో అంటే ‘అందమైన కన్యలు’ అని అర్థం. అంటే ఇక్కడ ‘జీహాద్’ కోసం ప్రాణాలర్పిస్తే స్వర్గంలో 72 మంది అందమైన కన్యలు సేవ చేస్తారు అని ఈ టైటిల్ ఉద్దేశం. ఈ చిత్రంలో అల్‌ఖైదా ముఖ్య బాస్‌లైన ఒసామా బిన్ లాడెన్, కసబ్, యూకూబ్ మొయిన్ వంటి నేతలను టీజర్‌లో చూపించారు.

ఇప్పటికే ఈ టీజర్‌పై చర్చలు మొదలయ్యాయి. ముస్లిం ధర్మగురువులు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ మతాన్ని టార్గెట్ చేసి , వివాదాస్పద చిత్రాలు తీయడం మంచి పద్దతి కాదని హెచ్చరిస్తున్నారు. తాము ప్రవర్త చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నామని, ఇలాంటివి ప్రచారాలు చేయవద్దని అంటున్నారు. అయితే సినిమాలు కూడా రాజకీయాలలో పావులుగా మారుతున్నాయి. వివాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. చిత్రదర్శకుడు సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్ తీవ్రవాదులు ఎక్కడనుండో రారని, సామాన్యప్రజల నుండే వారిని తయారు చేస్తున్నారని, ఈ 72 హురైన్ అనే పదం ప్రజలను తీవ్రవాదులుగా మార్చే శిక్షణలో వాడుతున్నారని అభిప్రాయపడ్డారు. టెర్రర్ గ్రూపులు ఎలాంటి మాటలు చెప్పి తమ గ్రూపులలో చేర్చుకుంటారో అనేది ముఖ్యంగా చూపించారు. టెర్రరిజం చుట్టూ ఈ చిత్రం తిరుగుతోంది. జూలై 7 ఈ చిత్రం ప్రజల ముందుకు రాబోతోంది. కాంట్రవర్సీలకు కేంద్రంగా మారిన ఈ చిత్రం విడుదల ఏమవుతుందో చూడాలి.