అట్టపెట్టలతో.. భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రేమించే విధంగా తమ పిల్లల్ని ఎవరు ప్రేమించలేరనే చెప్పాలి. ఆ ప్రేమతోనే తల్లిదండ్రులు ఎంత కష్టమైనా సరే వారికి మంచి చదువు చెప్పించి తమ పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలని అనుక్షణం తపన పడుతుంటారు. మరి అంతలా కష్టపడి పెంచినందుకు కనీసం కృతజ్ఞత కూడా లేకుండా కొంతమంది కొడుకులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన కొడుకులు ఆస్తి కోసం వారిని బెదిరిస్తూ..భయపెడుతున్నారు. అయితే తాజాగా కర్నూలులో కొడుకులకు భయపడిన ఓ తల్లి చనిపోయిన తన భర్త దహన సంస్కారాలను ఇంట్లోనే నిర్వహించింది.

అయితే ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. కాగా పత్తికొండకు చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్,లలిత భార్యభర్తలు. వీరిద్దరు పత్తికొండలో ఓ మెడికల్ షాపు నిర్వహిస్తూ..జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం వీరు నివాసం ఉంటున్న ఇంటి నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం ప్రారంభించాయి. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడి భార్య లలితతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే తన భర్త అనారోగ్యంతో ఈ రోజు ఉదయం మృతి చెందినట్లు ఆమె తెలిపింది. వీరికి ఇద్దరు కొడుకులు. వీరి పెద్ద కుమారుడు దినేశ్ కర్నూల్లోని ఓ ప్రైవేటు హస్పటల్లో పనిచేస్తుండగా..రెండో కుమారుడు కెనడాలో స్థిరపడినట్లు తెలుస్తోంది. తమ కుమారులిద్దరు తమను సరిగ్గా చూసుకోవడం లేదని లలిత తెలిపారు. కేవలం ఆస్తి కోసం మాత్రమే అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వేధిస్తుంటారని ఆమె పోలీసుల దగ్గర వాపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ల నాన్న చనిపోయాడని తెలిస్తే వచ్చి ఎక్కడ గొడవ పడతారో అనే భయంతోనే ఇంట్లో ఉన్న అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు మృతుడి భార్య లలిత పోలీసులకు వెల్లడించారు.