Home Page SliderNational

కథ అడ్డం తిరుగుతోంది.. సీఎం పీఠం కోసం శివకుమార్ మంకు పట్టు

కర్నాటక పీసీసీ చీఫ్, పార్టీ కీలక నాయకుడు, సీఎం పీఠాన్ని వదులుకునేది లేదంటూ కాంగ్రెస్ హైకమాండ్ ముందు గట్టి వాదన విన్పిస్తున్నారు. పార్టీ కోసం సర్వశ్వం త్యాగం చేస్తే, తనను ఇలా పక్కనబెడతారా అంటూ ఆయన రాహుల్ గాంధీ ముందు వాపోయారట. సిద్ధరామయ్యను గౌరవించండి.. ఆయన కోసం తనను బలిపశువు చేయొద్దని రాహుల్ గాంధీకి డీకే తేల్చి చెప్పారట. కర్నాటకలో బీజేపీకి ఎదురు తిరిగి పార్టీని విజయతీరాలకు చేర్చింది ఎవరని ఆయన రాహుల్ గాంధీని ప్రశ్నించారట. సోనియ గాంధీ సైతం, డీకే వైపు చూస్తున్నారన్న వర్షన్ విన్పిస్తోంది.

వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం సిద్ధరామయ్యకు సీఎం పీఠం ఖాయమంటూ ప్రచారం జరిగింది. ఆయన ప్రమాణస్వీకారానికి బయల్దేరుతున్నారని పార్టీ నేతలు భావించారు. వరుణ నియోజకవర్గంలో సంబరాలు కూడా జరుపుకున్నారు. ఐతే అంతలోనే డీకే, భీష్మించడంతో పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటోంది. ఈవాళ ఢిల్లీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ డీకే శివకుమార్‌కు రెండు ఆఫర్లు ఇచ్చారట. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిందట. రాహుల్, ఖర్గే చెప్పిన రెండు ఫార్ములాలను డీకే తిరస్కరించారట.

కర్నాటక పీసీసీ చీఫ్‌గా కొనసాగడంతోపాటుగా, ఒకే ఉప ముఖ్యమంత్రి పదవిని తనకే ఇస్తామని చెప్పారట. దాంతోపాటు, డీకేకు నచ్చిన ఆరు మంత్రిత్వ శాఖలను కూడా ఆఫర్ చేశారని చెబుతున్నారు. ఈ ఆఫర్ సామరస్యపూర్వక పరిష్కారించుకునేందుకు అవకాశం ఇచ్చారట. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయమని కోరినప్పుడు రాహుల్ గాంధీ వన్ మ్యాన్ వన్-పోస్ట్ నిబంధనను గుర్తు చేశారని కూడా పార్టీ నేతలు చెబుతారు. అలా కాని పక్షంలో ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు పార్టీ అగ్రనేతలు. శివకుమార్, సిద్ధరామయ్య మధ్య అధికారాన్ని పంచుతామని చెప్పారు. దీని ప్రకారం, సిద్ధరామయ్య రెండేళ్ల పాటు అత్యున్నత పదవి, తర్వాత శివకుమార్ మూడేళ్లపాటు సీఎంగా ఉండేలా సూచించారట. ఐతే ఈ ఎంపిక ఆమోదయోగ్యం కాదని ఇద్దరు నాయకులు తేల్చి చెప్పారట.