కన్నడ ఓటరు తీర్పుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు
కర్నాటకలో కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రత్యర్థి బీజేపీని దక్షిణాదిలో ఏకైక కోట నుండి గద్దె దింపుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ 138 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 63 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాలు పూర్తి అనుకూలంగా రావడంతో, కాంగ్రెస్, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నదానిపై కసరత్తు మొదలుపెట్టింది. విజయోత్సవ వేళ ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

ఇది నిజంగా కర్నాటక ప్రజల విజయమన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రజలు ప్రగతిశీల భవిష్యత్తు, సంక్షేమం & సామాజిక న్యాయం కోసం ఓటు వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచినందుకు ముకుళిత హస్తాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తోందన్నారు.

కర్నాటకలో పార్టీని గెలిపిస్తానని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున్ ఖర్గేలకు హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నానన్నారు కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్. ప్రజలకు, కార్యకర్తలకు డీకే కృతజ్ఞతలు తెలిపారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉందని చెప్పారు.

నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా తీర్పు ఇది అంటూ భాష్యం చెప్పారు మాజీ సీఎం సిద్ధరామయ్య. ఆపరేషన్ కమల, ఎమ్మెల్యేల వేట కోసం వారి వద్ద చాలా డబ్బు ఉంది, కానీ వారు ప్రజల నమ్మకాన్ని కొనుగోలు చేయలేకపోయారన్నారు. బీజేపీ వల్ల లౌకికవాదానికి ముప్పు ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ద్వేషపూరిత రాజకీయాలు ఉన్నాయని, వీటిని కర్నాటక ప్రజలు సహించలేకపోయారన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఈ ఫలితం ఒక గీటురాయిగా భావించాలన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించేందుకు పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటడంతో కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఓటమిని అంగీకరించారు. అనుకున్నట్టుగా ఫలితాలు రాలేదని, లోపాలను కనుగొని, పార్టీని పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్నారు. ప్రధాని మోదీ, కార్యకర్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ, ప్రజలను చేరుకోలేకపోయామన్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. ఒక జాతీయ పార్టీగా, కర్నాటక లోపాలను విశ్లేషించుకుంటామన్నారు. వివిధ స్థాయిలలో, ఏఏ లోపాలు, గ్యాప్స్ ఉన్నాయన్నదానిపై మేథోమథనం చేస్తామన్నారు. ఈ ఫలితాన్ని వచ్చే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లడం గురించి ఆలోచిస్తామన్నారు.
కర్నాటక ప్రజలు నిర్ణయాత్మక తీర్పు ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి చిదంబరం. బీజేపీ చెప్పే డబుల్ ఇంజన్, డబ్బు, కండబలం కర్నాటకలో పనిచేయలేదన్నారు. నిర్ణయాత్మక తీర్పును వెలువరించినందుకు ప్రజలకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలు ఒక రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కంటే ఎక్కువ. ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక విలువలను సమర్థించేందుకు దోహదపడతాయన్నారు. ఆధిపత్య సిద్ధాంతాలు, వివక్ష కారణంగా జరిగిన నష్టాన్ని ఆపుతాయన్నారు.