ద కేరళ స్టోరీ ఎందుకు నిషేధించారు, రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
“ది కేరళ స్టోరీ” ని బెంగాల్ ఎందుకు నిషేధించాల్సి వచ్చిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. నిషేధానికి కారణాలేంటో చెప్పాలని, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. “పశ్చిమ బెంగాల్ సినిమాను ఎందుకు నిషేధించాలి? ఇది దేశవ్యాప్తంగా నడుస్తోంది” అని కోర్టు పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమాను నిషేధించకపోయినప్పటికీ, లా అండ్ ఆర్డర్ ఆందోళనల కారణంగా థియేటర్ల యజమానులు సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు. ‘ది కేరళ స్టోరీ’ని నిషేధించిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్, ఇది “శాంతి భంగం కలిగించే అవకాశం ఉంది” అని పేర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఎలాంటి ద్వేషం లేదా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సినిమా నిర్మాతలు బెంగాల్ బ్యాన్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసారు. తమకు నష్టం వాటిల్లుతోందన్నారు. కేరళకు చెందిన 32,000 మంది మహిళలు ISISలో చేరారని పేర్కొంటున్న ఈ చిత్రం ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాల్లో అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పన్ను మినహాయింపులను పొందింది.