Home Page SliderTelangana

గవర్నర్‌పై మంత్రి హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణా నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా? అంటూ ప్రశ్నించారు రాష్ట్రమంత్రి హరీష్‌రావు. బీఆర్ అంబేద్కర్  సచివాలయ ప్రారంభానికి రాష్ట్ర ప్రధమ పౌరురాలికి ఆహ్వానం లేదంటూ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రకంగా స్పందించారు మంత్రి. గత కొన్ని నెలలుగా తెలంగాణా ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి ఉప్పు నిప్పులా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరీష్‌రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మీడియాతో మంత్రి మాట్లాడుతూ వందేభారత్ రైల్ ప్రారంభోత్సవాలకు ప్రధాని, రాష్ట్రపతిని ఆహ్వానించారా? అని ఎదురు ప్రశ్న వేశారు. ఎన్ని రైళ్లు ప్రారంభించారు అని ఎవరూ ప్రధానిని అడగలేదన్నారు. కార్యనిర్వాహక వర్గం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ పంపిన బిల్లులను గవర్నర్ నెలల తరబడి పెండింగులో పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక మహిళగా, గవర్నర్‌గా ఆమెను గౌరవిస్తామని, కానీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించలేమన్నారు. సుప్రీంకోర్టు మెట్లెక్కితే కానీ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందలేదన్నారు. ఐనప్పటికీ 7 ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లులను వెనక్కి పంపడం రాజకీయం చేయడమేనన్నారు.