Home Page SliderTelangana

హ్యాట్రిక్ సీఎం కేసీఆర్: కేటీఆర్

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రచార ఢంకా మోగిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. కాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో బీఆర్‌ఎస్ పార్టీకి 120కి గాను 90 నుంచి 100 సీట్లు వస్తాయని కేటీఆర్ అంచనా వేశారు. దీంతో కేసీఆర్ సౌత్ ఇండియాలోనే హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించబోతున్నారన్నారు. అంతేకాకుండా తెలంగాణాలో బీజేపీ 100 సీట్లలో ఓడిపోతుందని జోస్యం చెప్పారు. అయితే తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయనే మాటే కానీ..వారిలో ఎవరు సీఎం అభ్యర్థిగా పోటి చేస్తారో ఇప్పటికీ పార్టీలు ప్రకటించకపోవడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణాలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థులను ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.