పంచె కట్టుతో కేరళీయుల హృదయాల్లో మోదీ
కేరళలో వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
కేరళలో ప్రధాని నరేంద్రమోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశీయంగా తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కసరాగడ్ మధ్య రైలు నడుస్తుంది. వందే భారత్ ట్రైన్ తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కడ్, పతనమిట్ట, మలప్పురం, కాజీకోడ్, కానూర్, కసరాగడ్.. మొత్తం 11 జిల్లాల గుండా ప్రయాణిస్తుంది. వందేభారత్ రైలు దేశీయంగా తయారు చేయబడిన, సెమీ-హై-స్పీడ్, స్వీయ చోదక రైలు సెట్. ఈ రైలు ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలను అందిస్తోంది. ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
కేరళలో ఇవాళ మోదీ కొచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభిస్తారు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ల ద్వారా కొచ్చి చుట్టూ ఉన్న 10 దీవులను కలుపుతూ కొచ్చి వాటర్ మెట్రోను సిద్ధం చేశారు. కేరళ పర్యటనలో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. తిరువనంతపురం విమానాశ్రయంలో ప్రధాని మోదీ దిగిన తర్వాత, సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఆయన ప్రయాణం రోడ్‌షోతో సాగింది. వేలాది మంది రోడ్సైడ్ల ద్వారా, గంటల తరబడి నిరీక్షించి ఆయనకు స్వాగతం పలికారు. ప్రధానిపై పూల వర్షం కురిపించారు.
కేరళలో మైనార్టీలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్న బీజేపీ రాష్ట్రంలోని వివిధ క్రైస్తవ మత ప్రబోధకులను మోదీ కలుస్తారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మైనారిటీలకు చేరువయ్యే ప్రయత్నాలలో భాగంగా పార్టీ నాయకులు ఇటీవల క్రైస్తవ కుటుంబాలను సందర్శించారు. ప్రధాని మోదీ పర్యటన కేరళలో పార్టీకి ఊపు తీసుకొస్తుందని నేతలు భావిస్తున్నారు. ప్రధానమంత్రి ఇతర రోడ్‌షోలకు భిన్నంగా నిన్న కొచ్చిలో మెగా రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని మోదీ కారు దిగి కాలినడకన రోడ్‌షోలో పాల్గొన్నారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తామంటూ బెదిరింపు లేఖ రావడంతో కేరళ పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు భద్రతను కట్టిదిట్టం చేశారు.

