Home Page SliderInternational

పాకిస్తాన్‌పై టీ 20 సీరిస్‌ విజేతగా ఆప్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్ చారిత్రాత్మక T20I సిరీస్‌ విజయం
పాకిస్తాన్‌ను ఓడించి సత్తా చాటిన రషీద్ సేన
ఆరు ఆగ్రశ్రేణి జట్లలో తొలి విజయం పాక్‌పైనే!
టీ 20లోనూ రాణిస్తున్న ఆప్ఘనిస్తాన్ యువజట్టు

పిల్లకూనలనుకుంటే కుమ్మశారు. ఆప్ఘనిస్తాన్ క్రికెట్ టీమ్ ఇప్పుడు రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. పొరుగు దేశం పాకిస్తాన్‌తో షార్జా వేదికగా జరిగిన టీ 20 సీరిస్‌లో ఆప్ఘన్ కూనలు సత్తా చాటారు. మూడు మ్యాచ్‌ల సీరిస్‌ను 2-0తో గెలుచుకొని ఔరా అన్పించుకున్నారు. ఆదివారం జరిగిన రెండో ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి రషీద్ సేన భళా అన్పించుకొంది. చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి సత్తా చాటింది. లాస్ట్ రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సి ఉండగా… నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ… చేరో సిక్స్ కొట్టి జట్టును విజయపథంలో నడిపించారు. జమాన్ ఖాన్ వేసిన చివరి ఓవర్‌లో బౌండరీతో సీరిస్ విజయం ఖరారయ్యింది.

మరో బంతి మిగిలి ఉండగానే, 131 పరుగుల లక్ష్యాన్ని ఆప్ఘన్ జట్టు ఛేదించింది. ఈ అద్భుతమైన జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం, ఆనందంగా ఉందన్నాడు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్. బౌలింగ్‌లో రాణించి పాకిస్తాన్‌ను తక్కువ స్కోర్‌కు అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ గెలవగలిగామన్నాడు. ఈ పిచ్ పై 130 పరుగులు స్కోరు ఛేదించడం కష్టమే అయినా.. సమిష్టగా రాణించామన్నాడు. నబీ, నజీబ్ వంటి ఆటగాళ్లు రాణించడంతో విజయం సాధ్యమైందన్నాడు.

ప్రపంచంలోనే మేటి ఆరు జట్లైన… ఇండియా, ఇంగ్లండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఇప్పటి వరకు ఆప్ఘనిస్తాన్ టీ ట్వంటీ సీరిస్ గెలవలేదు. వెస్టిండీస్, బంగ్లాదేశ్‌లపై T20I సిరీస్‌లతోపాటుగా… జింబాబ్వేపై ఐదు మ్యాచ్‌లలో ఐదు సిరీస్‌లను గెలుచుకున్నప్పటికీ పాకిస్తాన్ జట్టుపై టీ 20 సీరిస్ విజయం అతి పెద్ద గెలుపుగా చెప్పాల్సి ఉంటుంది. రెహ్మానుల్లా గుర్బాజ్ (49 బంతుల్లో 44), ఇబ్రహీం జద్రాన్ (40 బంతుల్లో 38) రెండో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వికెట్లను కాపాడుకోవడానికి ప్రయత్నించడంతో.. జట్టు రన్ రేట్ భారీగా పడిపోయింది. చివరి 30 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిరావడంతో జట్టు ఒత్తిడికి గురయ్యింది. నజీబుల్లా (23), నబీ (14) నాటౌట్‌గా నిలిచి విజయాన్ని ఖాయం చేశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ను 63-5 కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఇమాద్ రెండు సిక్సర్లు, మూడు బౌండరీలతో రాణించడంతో, పాకిస్తాన్ కోలుకుంది. ఇమాద్, షాదాబ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్ 57 బంతుల్లో అజేయంగా 64 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 130-6 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఎడమచేతి వాటం పేసర్ ఫజల్‌హాక్ ఫరూకీ… సైమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్‌లను వికెట్లను తీసి పాకిస్తాన్ వెన్నువిరిచాడు. ఫరూఖీ నాలుగు ఓవర్లను 2-19తో ముగించాడు. జట్టు ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చామన్నాడు. భవిష్యత్తులో వారిని మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం కోసం సన్నద్ధం చేస్తున్నామన్నాడు.

పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్… షఫీక్ నవంబర్ 2020లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఆడిన అన్నీ సీరిస్‌లలోనూ తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నాడు. మహ్మద్ హారీస్ తొమ్మిది బంతుల్లో ఒక సిక్స్, రెండు బౌండరీలతో 15 పరుగులు చేయగా, తయ్యబ్ తాహిర్ 23 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఇటీవలి పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పవర్ హిట్టింగ్‌తో ఖ్యాతి గడించిన అజం ఖాన్, స్పిన్నర్ రషీద్ ఖాన్ చేతిలో ఔటయ్యాడు. కెప్టెన్ బాబర్ అజామ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన షాదాబ్, 25 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో లాహోర్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇమాద్ 47 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేశాడు.