కరోనాపై కేంద్రం అలర్ట్… పరీక్షలు పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతోండటంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వ్యాప్తిని తెలుసుకోవాలంటే అన్ని రాష్ట్రాల్లోనూ తగినన్ని టెస్టులు చేయాలని పేర్కొంది. కొన్ని వారాలుగా పలు రాష్ట్రాలు కరోనా టెస్టులను పూర్తిగా తగ్గించేశాయని కేంద్రం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి పది లక్షల మందికి 140 మందికి టెస్టులు తప్పనిసరిగా చేయాలంది. జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయిలో టెస్టులు నిర్వహించాలంది. తగినన్ని టెస్టులు చేయడానికి పలు రాష్ట్రాల వద్ద యాంటీజెన్ టెస్టు కిట్ల లభ్యత లేదని కేంద్రం పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం వీటిపై శ్రద్ధ పెట్టాలంది. కోవిడ్ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో తక్షణం టెస్టులను పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కరోనా ప్రబలుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించి కట్టడి చేస్తేనే.. వ్యాప్తి తగ్గుతోందంది. కరోనా, ఇన్‌ఫ్లుయంజా రెండూ ఒకేరకమైన లక్షణాలతో ఉండటం వల్ల ఏది వ్యాపిస్తుందో కూడా అర్థం కావాడం లేదని… సరైన సూచలు, జాగ్రత్తలు తీసుకుంటే కరోనా గానీ ఇన్‌ఫ్లుయంజాను కట్టడి చేయడం తేలికేనని కేంద్రం అభిప్రాయపడింది.

కరోనా కట్టడికి కేంద్రం మార్గదర్శకాలు
రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే మేలంది. పలు రకాల అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు (రెండు మూడు రకాల సుదీర్ఘ జబ్బులున్నవారు కోమార్బిడ్) అసలే రద్దీ ఏరియాల్లోకి వెళ్లద్దని స్పష్టం చేసింది. సరైన వెంటిలేషన్ లేని ప్రాంతాల్లోకి వెళ్లడాన్ని నివారించాలి.
వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, రోగులు, వారి సహాయకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
రద్దీగా ఉండే ప్రాంతాలతోపాటు, క్లోజ్డ్ రూమ్స్‌లో ఉండేవారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.
తుమ్మేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. రుమాలు లేదా టిష్యూలను ఉపయోగించాలి.
చేతుల పరిశుభ్రతను పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవాలి.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నివారించాలి.
పరీక్షలను ప్రోత్సహించడం, లక్షణాలుంటే తగిన చర్యలు తీసుకోవాలి.
శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు తిరగకుండా ఉండాలి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్‌లో కోవిడ్ సన్నద్ధతపై మాక్-డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రాలు ఆసుపత్రుల సంసిద్ధతను, మందులను, lCU పడకలతో సహా పడకల వివరాలను తెలుసుకోవాలని భావిస్తోంది. వైద్య పరికరాలు, ఆక్సిజన్, ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలపై మానవ వనరుల సామర్థ్యం పెంపుదల, అలాగే టీకా లభ్యతపై దృష్టిసారించాలంది. ఏప్రిల్ 10, 11 తేదీలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను ప్లాన్ చేస్తోంది. దేశంలోని అన్ని జిల్లాల నుండి ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్న సౌకర్యాలు, ప్రైవేట్ వైద్య సేవల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నట్టు పేర్కొంది. మార్చి 27న జరగనున్న వర్చువల్ సమావేశంలో మాక్ డ్రిల్ వివరాలను రాష్ట్రాలకు అధికారులు వెల్లడిస్తారు.

