అధికార వైసీపీలో కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు
• పట్టభద్రుల నియోజకవర్గంలో ఎదురైనా అనూహ్య పరిణామాలపై దృష్టిసారించిన జగన్
• ఎమ్మెల్యే కోటా ఓటింగ్ పై ముందు జాగ్రత్తలు
• పోలింగ్ కు ముందే మాక్ పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు అధికారపక్షంలో కాకపుట్టిస్తున్నాయి. ఉపాధ్యాయ పట్టభద్ర నియోజకవర్గాల లో ఎదురైన అనూహ్య పరిణామాలపై జగన్ దృష్టి సారించారు. ముఖ్యంగా పట్టభద్రుల నియోజకవర్గాలలో వెనుకంజలో ఉండటానికి గల కారణాలపై విశ్లేషణ ప్రారంభించారు. ఈ మేరకు ఢిల్లీ నుండి శుక్రవారం సాయంత్రం తాడేపల్లికి చేరుకున్న సీఎం జగన్ లోపాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు ఉత్తరాంధ్ర నేతలు కూడా సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. సీఎం జగన్ కు జరిగిన పరిణామాలను వివరించేందుకు ముందస్తుగా వారు సిద్ధమయ్యారు అయితే ఇదే తరహా పరిస్థితులు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఎదురయ్యే అవకాశాలను ముందుగానే పసిగట్టిన సీఎం జగన్ అసెంబ్లీ రోజు నిర్వహించిన క్యాబినెట్ లో మంత్రులకు క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే నష్ట నివారణ చర్యలకు అధికార పార్టీ ఉపక్రమించినట్లు చెబుతున్నారు. అయితే ఒక వైపు పట్టభద్రుల ఫలితాలపై ఆరా తీస్తూనే మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల గెలుపు కోసం ఏం చేయాలన్న దానిపై సీఎం జగన్ పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.

ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తామంటూ అక్కడక్కడ కొన్ని మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ రెండు టాస్క్‌లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గతంలో చెప్పిన విధంగానే ఒక్కోమంత్రికి సగటున 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి వారిని ఓటింగ్ లో పాల్గొనేలా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా చూసేలా బాధ్యతలు అప్పగించారు. ఇక రెండో దాని కింద ఈనెల 23న జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే మాక్ ఓటింగ్ నిర్వహించి సభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం జగన్ మరింత ఫోకస్ పెంచినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. స్థానిక సంస్థల కోటాలో అధికార వైఎస్ఆర్సిపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం తొమ్మిది స్థానాల్లో ఐదు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లోనూ వైఎస్ఆర్సిపీ అభ్యర్థులు విజయం సాధించారు. పట్టభద్రులు ఎన్నికల్లో పీడీఎఫ్‌తో తెలుగుదేశం ఓటింగ్ కోసం చేసుకున్న అవగాహన తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చిందని అధికార పార్టీ భావిస్తోంది.

తాజా ఫలితాలు తెలుగుదేశం పార్టీ బలపడిందన్నది కాదని అయితే ఇదేమి చిన్న పరిణామం మాత్రం కాదని సీఎం జగన్ అన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర రాయలసీమ పట్టభద్రుల సీట్లలోనూ వైఎస్ఆర్సిపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అంతేకాకుండా ఉపాధ్యాయ స్థానాల్లోనూ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఇకపై అటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానిపై సీఎం జగన్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనంత మాత్రాన నష్టమేమీ లేదని ఇవి సార్వత్రిక ఎన్నికలకు రిఫరెండమ్ ఏమి కాబోవని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజలలో సీఎం జగన్ పట్ల సానుకూలత ఏమి తగ్గలేదని పట్టభద్రులు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై విశ్లేషణ ప్రారంభమైందని అన్ని కోణాల్లోనూ సీఎం సమగ్రంగా విశ్లేషించి సమచిత నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో వ్యవహరించాల్సిన అంశాల పై ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.

