ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్తత… ఆక్రమణల కూల్చివేత
గుంటూరు, తాడేపల్లి మండలం ఇప్పటంలో అధికారులు ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తున్నారు. కొందరు ఇంటి ప్లాన్లను అతిక్రమించి చుట్టూ ప్రహరీలు కట్టారని నిర్థారించిన అధికారులు రంగంలోకి దిగారు. ప్రహరీగోడలను జేసీబీల సాయంతో కూల్చేశారు. గోడలు కూల్చొద్దంటూ ఇళ్ల యజమానులు వేడుకున్నా… అధికారులు మాత్రం కొనసాగించారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులను అధికారులు మోహరించారు. ఇప్పటంలోకి బయట వారు రాకుండా గ్రామ హద్దుల వద్ద బలగాలను పెట్టారు. ఐతే గ్రామంలో ఆటోలుగానీ, బస్సులు గానీ రావని.. 70 అడుగుల రోడ్లు ఏర్పాటు చేయడమెందుకని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన గ్రామ అధ్యక్షుడు నరసింహారావు ఇంటిని కూల్చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకొంది. స్థానికులు, అధికారులను ప్రశ్నించడంతో ప్రహరీ గోడలు కూల్చి వెళ్లిపోయారు. అధికారులు ఆక్రమణల పేరుతో తొలగింపు చేపడతారన్న భయంతో కొందరు గ్రామస్తులు కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. గతంలో కూల్చివేతల సందర్భంగా పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు.
