గిన్నిస్ బుక్ ఎక్కిన కోడిపెట్ట
అమెరికాలోని ఒక పెంపుడు కోడి గిన్నిస్ రికార్డు సాధించింది. ఎలా అంటే ప్రపంచంలో అత్యధిక వయస్సున్న కోడిగా ప్రసిద్ధికెక్కింది. సాధారణంగా కోడి జీవితకాలం 5 నుండి 10 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఇది ఏకంగా 21 సంవత్సరాలు వయస్సుకొచ్చేసింది. దీనితో ఇది అత్యధిక రోజులు జీవించిన కోడిగా గిన్నిస్‌లో స్థానం సంపాదించింది. అమెరికాలోని మిచిగాన్‌లో నివసించే మార్సీ అనే లైబ్రేరియన్ తన ఇంట్లో కుక్కలతో పాటు ముద్దుగా ఈ కోడిని కూడా పెంచుకుంటోంది. దీనికి పీనట్ అని పేరు పెట్టింది.

ఈ పీనట్ మార్సీకి 2002 లో దొరికిందట. గుడ్లను పూర్తిగా పొదగకముందే వాళ్లమ్మ గూడు వదిలిపోయిందట. దీనితో గుడ్లు కుళ్లిపోయాయనుకొని, మార్సీ చెత్తబుట్టలో పారేసిందట. కాసేపటి తర్వాత కోడిపిల్ల అరుస్తున్న శబ్ధం వినిపించి చూస్తే కోడిపిల్ల గుడ్డులోంచి బయటపడిందట. అలా పుడుతూనే చచ్చి బతికిందన్నమాట మన పీనట్. దీనిని ఆమె చాలా ప్రేమగా చూసుకుంటోంది. దీనికి తాజాపండ్లు, కూరగారలు, విటమిన్ డి మాత్రలు తినిపిస్తుందట. ఇది తన జీవితకాలంలో ఎన్నో గుడ్లు పెట్టిందట. తన పిల్లల కంటే ఎక్కువకాలం బతికిన కోడిగా ఖ్యాతి వహించిందీ కోడిపెట్ట. ప్రస్తుతం వయస్సు ఎక్కువవడంతో ఓల్డేజ్ పౌల్ట్రీలో ఉంటోంది.