Andhra PradeshHome Page Slider

మరోసారి విచారణకు రావాలని వైఎస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ పిలుపు

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డికి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో భాస్కర్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. కొద్దిరోజుల క్రితం భాస్కర్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ బృందం కడప చేరుకొని హోటల్లో బస చేసిందని సిబిఐ నుంచి పిలుపు వస్తుందని భాస్కర్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరిగిన విచారణ మాత్రం జరగలేదు. చివరికి తనకు సిబిఐ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని పైగా తాను కాల్ చేసిన ఎవరు స్పందించలేదని భాస్కర్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు.

తాజాగా సిబిఐ సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేయటం పట్ల ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంట్లో నోటీసులు అందజేసింది. ఈ నెల 12వ తేదీన కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్ ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో ఉన్నారు. సునీల్ యాదవ్ బెయిల్ నిరాకరిస్తూ రెండు రోజులు క్రితమే తెలంగాణ హైకోర్టు పిటిషన్ కొట్టేసిన విషయం తెలిసిందే. సునీల్ యాదవ్ బెయిల్ తిరస్కృతి జరిగిన తర్వాత తాజాగా సిబిఐ భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటికే రెండుసార్లు హైదరాబాద్ కార్యాలయంలో విచారించిన సిబిఐ గత నెల 18న తొలిసారి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ముందస్తు కార్యక్రమాలతో గత నెల 23న విచారణకు రాలేదని భాస్కర్ రెడ్డి అన్నారు. అవినాష్ రెడ్డి, సీఎం జగన్ ఓఎస్డి కృష్ణమోహన్, నవీన్ లను ప్రశ్నించి సిబిఐ విచారణలో లభించిన సమాచారం ఆధారంగా భాస్కర్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.